సీనియర్స్ Vs జూనియర్స్… జగిత్యాల కాంగ్రెస్ లో సరికొత్త సమస్య

దిశ దశ, జగిత్యాల:

ఇంతకాలం ఒకే తాటిపై ఉన్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సమస్య మొదలైనట్టుగా ఉంది. ఇంతకాలం జీవన్ రెడ్డి వెన్నంటి ఉన్న వారిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే కొత్త నాయకత్వం తమను గుర్తించడం లేదన్న ఆవేదన మొదలైంది. తాము జీవన్ రెడ్డితో వెళ్లవద్దని అదిష్టానం పెద్దలు ఒప్పించారని అయితే ఇప్పుడు తమను పట్టించుకునే వారే లేకుండా పోయారన్న ఆవేదన వ్యక్తం అవుతున్నట్టుగా ఉంది. జీవన్ రెడ్డితో వెళ్లవద్దని నామినేటెడ్ పదవులు కట్టబెడ్తామని మాట ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం కొత్త రక్తానికే అవకాశం ఇస్తున్నారన్న ఆందోళన స్థానిక నాయకుల్లో వ్యక్తం అవుతోంది.

కో ఆప్షన్ తో…

మునిసిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలప్పుడు జీవన్ రెడ్డి మద్దతులో గెలిచిన తొమ్మిది మంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులను పట్టించుకునే వారే లేకుండా పోయారని అంటున్నారు. మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులను సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన అనుచరులకే ఇప్పించుకునేందుకు మొగ్గు చూపుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎమ్మెల్యే సన్నిహితులకే కో ఆప్షన్ పదవులు కట్టబెట్టాలన్న ప్రతిపాదనలు సిద్దమయ్యాయని తమకు గుర్తింపు లేకుండా పోయిందని వారు వాదిస్తున్నారు. అలాగే జీవన్ రెడ్డి వర్గానికి చెందిన తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ తమను పట్టించుకునేవారు లేకుండా పోయారని తొమ్మిది కౌన్సిలర్లు వాపోతున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్ అనుచరులకు మాత్రమే అన్నింటా ప్రాధాన్యత లభిస్తోందని ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటీన్న తర్జనభర్జనలు పడుతున్నట్టుగా సమాచారం. ఈ నేఫథ్యంలో తమపై జరుగుతున్న వివక్ష గురించి పార్టీ సీనియర్ల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

అడ్లూరి ఎంట్రీ…

జగిత్యాలలో నెలకొన్న పరిణామాలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి వెళ్లినట్టుగా సమాచారం. ఆయన జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి మంత్రి తీసుకెళ్లినట్టుగా సమాచారం. జగిత్యాల నాయకలతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సోమవారం మద్యాహ్నం నాలుగు గంటలకు సీఎం అపాయింట్ మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జగిత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు 56 మంది హైదరాబాద్ కు మరికొద్ది సేపట్లో పయనం కానున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులను సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు రంగం సిద్దం చేశారు.

ADLURI LAXMAN KUMARCONGRESS PARTYJAGITIAL NEWST CONGRESST JEEVAN REDDY
Comments (0)
Add Comment