దిశ దశ, కరీంనగర్:
బుధవారం ఉదయం మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పోలింగ్ మెటిరియల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. పోలింగ్ డ్యూటీలో ఉండే సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రశీదులతో పాటు ఇతరాత్ర స్టేషనరీ సామాగ్రిని అప్పగించింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల వారిగా ఏర్పాటు చేసిన బూతుల్లో సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు అవసరమైన టేబుళ్లు, కుర్చీలను సమకూర్చాల్సి ఉంది. అయితే మంగళవారం మద్యాహ్నం వరకు నగరంలోని కొన్ని బూతుల వద్దకు చేరుకున్న పోలింగ్ స్టాఫ్ కు సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టుగా కనిపించింది. బుధవారం ఉదయమే పోలింగ్ చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో బూత్ పరిధిలోని పోలింగ్ సకాలంలో ప్రారంభం అయ్యేందుకు ముందు రోజే అన్ని రకాలుగా సిద్దం చేస్తుంటారు. అయితే కరీంనగర్ లోని కొన్ని పొలింగ్ బూత్ ల్లో కనీసం టేబుళ్లు కూడా లేకపోవడం గమనార్హం. ప్రత్యేకంగా ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఓటర్లు రహస్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు చుట్టూ కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోలింగ్ సిబ్బంది కూర్చునేందుకు, ఓటర్లకు బ్యాలెట్ పేపర్లు ఇవ్వడానికి, ఓటు వేసిన వారికి మార్కింగ్ చేయడానికి అనుగుణంగా టేబుళ్లను సమకూర్చాల్సి ఉంటుంది. కానీ ఇవేవి కొన్ని బూతుల్లో కనిపించకపోవడం పోలింగ్ యంత్రాంగ్రాన్ని విస్మయపర్చింది. మరో వైపున పోలింగ్ బూతుల్లో డ్యూటీ చేసేందుకు సిబ్బంది చేరుకునే సరికి మునిసిపల్, బీఎల్ఓ, పోలీసు విభాగాలకు చెందిన వారు ఉండాలి. కానీ కొన్ని పోలింగ్ బూతుల వద్దకు యంత్రాంగం చేరుకున్నప్పటికీ మునిసిపల్ నుండి కానీ ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సిన బీఎల్ఓలు కానీ కనిపించకపోవడం గమనార్హం. కేవలం పోలీసులు, పోలింగ్ మెటీరియల్ తీసుకొచ్చిన బూత్ సిబ్బంది మాత్రమే కనిపించారు. మిగతా వారెవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం. బూత్ ల వద్దకు పోలింగ్ సిబ్బంది చేరుకుని దాదాపు రెండు గంటలు గడిచినా సంబంధిత అధికార యంత్రాంగం ఆయా బూతుల వద్దకు చేరుకోకపోవడంతో డ్యూటీ చేసేందుకు వెళ్లిన సిబ్బందికి పాలుపోని పరిస్థితి ఎదురైంది. పొలింగ్ మెటిరీయల్ డిస్ట్రిబ్యూషన్ చేసే విషయంలో ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయోనన్న విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాగు నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదని పోలింగ్ స్టాఫ్ వాపోతోంది. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలప్పుడు మోడల్ బూత్ లను తీర్చిదిద్ది పోలింగ్ కేంద్రాలను సుందరంగా తయారు చేసేందుకు చొరవ తీసుకున్నా… మునిసిపల్ ఎన్నికల్లో మాత్రం కనీస సౌకర్యాలను కల్పించకపోవడం వల్ల పోలింగ్ డ్యూటీ చేసే యంత్రాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.