ఆ అగ్రనేత ఎక్కడా..?
దిశ దశ, దండకారణ్యం:
విప్లవోద్యమంలో అత్యంత సుదీర్ఘ కాలం కీలక బాధ్యతల్లో కొనసాగిన ఆయన స్పందించడం లేదెందుకు..? ఐదు దశాబ్దాలకుపైగా విప్లవ బాటలో కొనసాగుతున్న ఆనేత పార్టీ చీఫ్ గా పాతికేళ్లకు పైగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లోను ఆయన తెరపైకి ఎందుకు రావడం లేదు..? ఆయన మౌనం వీడకపోవడానికి కారణమేంటన్నదే చర్చనీయాంశంగా మారింది.
దళపతి… గణపతి…
జగిత్యాల జిల్లా బీర్పుర్ నివాసి అయిన ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి భారత విప్లవోద్యమంలో అత్యంత ముఖ్య నేత. ఉపాధ్యాయునిగా కొనసాగిన ఆయన ఉద్యమాల వైపు అడుగులు వేశారు. కరీంనగర్ జిల్లా కార్యదర్శి నుండి పీపుల్స్ వార్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా, మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తరువాత కూడా అదే బాధ్యతల్లో కొనసాగారు. 2017లో మావోను ఆదర్శంగా తీసుకున్న ఆయన వయోభారంతో తన బాధ్యతల నుండి తప్పుకుంటున్నానని ప్రకటించి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ను కేంద్ర కమిటీ కార్యదర్శిగా చేశారు. ఆ తరువాత అంతర్జాతీయ విప్లవ సంఘాల కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే పాతికేళ్ల పాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన గణపతి భారత దేశ వామపక్ష విప్లవాల్లో చెరగని ముద్ర వేశారు. దేశ వ్యాప్తంగా పార్టీ నిర్మాణం చేయడంలో ఆయన వ్యూహాలే ప్రధాన కారణం. చాలా వరకూ పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం అయ్యేవారని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారని పార్టీ వర్గాలు చెప్తుంటాయి. కొయ్యూర్ ఎన్ కౌంటర్ లో మరణించిన ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అంత్యక్రియల సమయంలో సంతాప సందేశాన్ని పంపించారు తప్ప మిగతా ఏ సందర్భంలోనూ గణపతి నుండి బాహాటంగా స్పందన మాత్రం రాలేదు.
ఈ పరిస్థితుల్లోనూ..?
భారత విప్లవోద్యమాలు తుది అంకానికి చేరుకున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత బలమైన మావోయిస్టు పార్టీ ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. జనతన్ సర్కార్ నిర్వహించి ప్రపంచ చరిత్రలోనే తిరుగులేని ఘనత సాధించిన మావోయిస్టు పార్టీని సమూలంగా అంతం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. బస్తర్ అటవీ ప్రాంతంలో ఆదిపత్యం ప్రదర్శించిన మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. చత్తీస్ గడ్ ప్రభుత్వం కూడా ఇదే పంథాను కొనసాగిస్తోంది. పార్టీకి అయువు పట్టుగా నిలిచిన వారిలో కొంతమంది ఎన్ కౌంటర్ లలో చనిపోగా, మరి కొంతమంది బాహ్య ప్రపచంలోకి వచ్చేస్తున్నారు. చారు మజుందార్ తరువాత పోలీసుల కాల్పుల్లో కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజ్ మరణించిన తరువాత కూడా గణపతి నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజా పరిణామాలయితే విప్లవ ఉనికికే సవాల్ విసురుతున్నా ఆయన మాత్రం మౌనాన్ని వీడడం లేదు. దళపతి గణపతి పరిస్థితి ఏంటన్న ఆందోళన కొందరిలో వ్యక్తం అవుతుంటే ఆయన సురక్షిత ప్రాంతంలోనే ఉన్నారన్న నమ్మకంతో మరికొంతమంది ఉన్నారు. పోలీసులు మాత్రం గణపతి ఆచూకి కోసం అన్వేషణ కొనసాగిస్తునే ఉన్నారు.
ఎక్కడున్నాడో..?
అగ్రనేత గణపతి ఇంతకి ఎక్కడున్నదే పజిల్ గా మారింది. సుదీర్ఘ కాలంగా దండకారణ్య అటవీ ప్రాంతంలోనే ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నా ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఆయన అక్కడే ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆపరేషన్ కగార్ జరుగుతన్న ఈ సమయంలో వయోబారం, అనారోగ్యంతో ఉన్న సీనియర్ నాయకుల విషయంలో పార్టీ ప్రత్యేక దష్టి సారించింది. గరియాబంద్ ఎదురు కాల్పుల్లో చలపతి మరణం తరువాత అయితే ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మరో వైపున గణపతిని దాదాపు ఏడాదిన్నర క్రితమే దండకారణ్య అటవీ ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన సేఫ్ జోన్ లోనే ఉన్నారన్న వాదనలు వినిపస్తున్నా కేంద్ర కమిటీ నుండి సాధారణ క్యాడర్ వరకు తీవ్రమైన నిర్భందం ఎదుర్కొంటున్న ఈ సమయంలోనూ ఆయన నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడానికి ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది.