కరీంనగర్ రోడ్లపై వరద నీటి ప్రవాహానికి కారణం…
దిశ దశ, కరీంనగర్:
వానోస్తే చాలు వరద నీటి ప్రవాహంతో కరీంనగర్ రోడ్లు నిండిపోతున్నాయి. గంటల తరపడి రోడ్లన్ని జలమయమై పోతున్నాయి. వర్షం కురిసిందంటే చాలు జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. అసలు కారణమేంటన్నది మాత్రం అంతు చిక్కకుండా పోతోంది. అధికారులు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టయితే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
డిసిల్ట్రేషన్…
త్వరితగతిన విస్తరించిన నగరాల్లో ఒకటైన కరీంనగర్ లో నివాస ప్రాంతాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇందుకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు నిధులు కూడా విడుదల అవుతున్నప్పటికీ లోతట్లు ప్రాంతాలే కాకుండా ప్రధాన రహదారులు కూడా వరద నీటి ముంపునకు గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఇండ్లలోకి చొరబడుతోందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వర్షాకాలం రాకముందే బల్దియా డ్రైనేజీలలో డిసిల్ట్రేషన్ చేపట్టేందుకు ప్రత్యేకండా టెండర్లకు ఆహ్వానిస్తుంది. వానలు మొదలు కాకముందే డ్రైనేజీల్లో పేరుకపోయిన సిల్ట్ తొలగించినట్టయితే వరద నీరు దిగువ ప్రాంతాలకు సాఫీగా వెల్లిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే చాలా వరకు కూడా డిసిల్ట్రేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మొక్కుబడిగానే ఈ చర్యలు చేపడుతుండడం వల్లే వర్షం పడగానే రహదారులపైకి వరద నీరు వచ్చి చేరుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం కురిసిన వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులన్ని కూడా వాన నీటితి నిండిపోయాయి. మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్ లలో సిల్ట్ తొలగించిన తరువాత కొద్ది సేపట్లోనే సమస్యకు పరిష్కారం దొరికింది. ఇదే పరిస్థితి ఇతర ప్రాంతాల్లోనూ ఎదురై ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది.
చిన్న నీటి వనరులు…
ఇకపోతే కరీంనగర్ తో పాటు విలీన గ్రామాల్లో ఒకప్పుడు చిన్న నీటి వనరులు ఉండేవి. కాలనుగుణం అవి అంతర్థానం కావడంతో కూడా వరద నీరు నేరుగా రోడ్లపైకి వస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ నీటి వనరుల ఉనికే లేకుండా పోవడం కూడా ఈ పరిస్థితికి మరో కారణమని చెప్పక తప్పదు. చిన్న చిన్న కుంటలు వాటి శిఖం భూములు అన్ని కూడా ఆక్రమణకు గురి కావడం వల్ల భారీ వర్షాలు పడినప్పుడు వరద నీరంతా లొతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. నీటి వనరులు కాపాడినట్టయితే వరద నీరంతా కూడా కుంటల్లోకి చేరుకుని అక్కడి నుండి గొలుసు చెరువుల మీదుగా మానేరు నదిలో కలిసే విధంగా అప్పుడు ప్రణాళికలు రూపొందించారు. కానీ చాలా వరకూ నీటి వనరుల ఉనికి కూడా లేకుండా పోవడం వల్లే వానాకాలం కష్టాలకు మరో కారణమని స్థానికులు అంటున్నారు.