దిశ దశ, హైదరాబాద్:
ప్రభుత్వంలో జరిగే తప్పిదాలను ఎత్తి చూపుతూ… అవినీతి అక్రమాల భరతం పట్టాల్సిన నాలుగో స్తంభం కూడా దారి తప్పుతోందా..? నిబంధనల అతిక్రమణలను వెలుగులోకి తీసుకరావలసిన మీడియా తన వరకు వచ్చే సరికి రూల్స్ పక్కన పెడుతోందా..? అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. కానీ తెలంగాణ నుండి వెలువడుతున్న పత్రికలకు సంబంధించి సర్క్యులేషన్ వివరాలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలకు, సమాచార పౌర సంబంధాల శాఖకు సమర్పించిన వివరాలకు ఏ మాత్రం పొంతన లేనట్టుగా స్పష్టం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్స్ విభాగం వెబ్ సైట్ లో పొందు పర్చిన వివరాలో ఓ విధంగా ఉంటే తెలంగాణ ఐ అండ్ పీఆర్ జాబితాలో ఉన్న వివరాలు మరోలా ఉండడమే విస్మయం కల్గిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ముద్రణ అవుతున్న తెలుగు పత్రికలు 121 మాత్రమే ఈ వైబ్ సైట్ లో ఉండగా, అందులో ఏబీసీ పరిధిలో కేవలం 7, సీఏ పరిధిలో 113, ఒకటి పీఆర్జీఐ పరిధిలో ఉన్నట్టుగా స్పష్టంగా పేర్కొనబడింది. ఏబీసీ, పీఆర్జీఐ పరిధిలో ఉన్న పత్రికలు, వాటి ఎడిషన్ సెంటర్లు, బిగ్, మీడియం, స్మాల్ కేటగిరిల వారిగా స్పష్టంగా పేర్కొనగా, సీఏ పరిధిలోకి వచ్చే పత్రికలన్నింటిని కూడా స్మాల్ కేటగిరిల్లో చేర్చినట్టుగా స్పష్టంగా ఉంది. పత్రికలు, ఎడిషన్ సెంటర్లు వాటి సర్క్యూలేషన్ వివరాలను కూడా ఈ వెబ్ సైట్ లో రేట్ కార్డు ఆమోదం పొందినట్టుగా వివరంగా పేర్కొన్నారు. Central bureau of communication website ఈ వివరాలను వెల్లడించింది. ఇంగ్లీష్ పత్రికల విషయానికి వస్తే 1 ఏబీసీ పరిధిలో, 2 పీఆర్జీఐ పరిధిలో, 36 సీఏ పరిధిలో ఉన్నాయి. ఉర్దూ పత్రికల విషయానికొస్తే 2 ఏబీసీ, 19 సీఏ పరిధిలో, హిందీ అయితే సీఏ పరిధిలో 7 ఉన్నాయి. ఇకపోతే ప్రతి నెల ఆయా పత్రికలు ప్రింట్ అవుతున్న వివరాలను కూడా పొందు పర్చారు. ఇందులో జనవరి నెలలో తెలుగు పత్రికల సర్క్యూలేషన్ ఆధారంగా అయితే చాలా వరకూ స్మాల్ కేటగిరిలో పరిధిలోకే రానున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇలా భాషల వారిగా అన్ని పత్రికల సర్క్యూలేషన్ వివరాలు ఈ వెబ్ సైట్ లో పొందుపర్చారు. అయితే తెలంగాణ ఐ అండ్ పీ ఆర్ విభాగంలో బిగ్, మీడియం, స్మాల్ కేటగిరి పరిధిలో చేర్చిన కొన్ని పత్రికల సర్క్యూలేషన్ కు కేంద్ర ప్రభుత్వంలోని Central bureau of communication website లో వెల్లడించిన వివరాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండడం విచిత్రమని చెప్పాలి. కొన్ని ప్రధాన పత్రికల సర్క్యూలేషన్ ఎడిషన్ల వారిగా పరిశీలిస్తే స్మాల్ కేటగిరిలో ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.