ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
దిశ దశ, హుజురాబాద్:
నేరుగా కొట్లాడుతా… వీధి పోరాటాలు చేయను… బీ కేర్ ఫుల్ బిడ్డా నేను శత్రువుతో కొట్లాడుతా… కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను… హుజురాబాద్ అడ్డాలో నా వాళ్లే గెలిచి తీరుతారంటూ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గం నుండి శామీర్ పేటలోని ఆయన నివాసానికి తరలి వెల్లిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. హుజురాబాద్ కు రావల్సిందే… మీతో మాకున్న అనుబంధాన్ని కొనసాగించాల్సిందే… మా కోసం ప్రత్యేకంగా ఆఫీసులు తెరవాల్సిందేనంటూ ఈటల రాజేందర్ అనుచరులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమర్జెన్సీ కాలంలో ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ
ఎమర్జెన్సీ విధించినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ లేకున్నా గ్రామానికి వచ్చే ఒకటి రెండు న్యూస్ పేపర్లు, ఆల్ ఇండియా రేడియోలో వచ్చిన వార్తలను విని కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చైతన్యం వచ్చింది. ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది సెల్ ఫోన్లు వినియోగిస్తున్నా ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్న రీతిలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాపై బ్రతికే వాళ్లు, అబద్దాల పునాదుల మీద, బ్రతుకే వాళ్లు. కుట్రలు కుంతంత్రాలపై బ్రతికేవాళ్లు ఉంటారన్నారు. తాను బాజాప్తా యుద్దం చేస్తా కానీ బేజాప్తాగా యుద్దం చేయనన్న ఈటల చరిత్ర లేకుండా వర్తమానం ఉండదని, వర్తమానం లేకపోతే భవిష్యత్తు ఉండదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పదవుల కోసం పెదవులు మూసే రకాన్ని కాదని తానిప్పటికే రెండు సార్లు మంత్రిగా పని చేశానన్నారు. అధికారంలో ఉన్నా కూడా ముఖ్యమంత్రులను ఎదిరించిన సందర్భాలు ఉన్నాయని, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రులతోనే కొట్లాడిన సందర్భాలూ ఉన్నాయని ఈటల అన్నారు. తాను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గానికి అవసరమైన నిధులు తెప్పించుకోవడంలో సక్సెస్ అయ్యానని, సమైక్య పాలనలో ముఖ్యమంత్రులు సైతం భయంతో నిధులు కెటాయించారన్నారు.
నా గురించి తక్కువ తెలుసు…
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తాను ఎన్నో రకాల పోరాటాలు చేశానని గుర్తిచేసిన ఈటల ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు తాను ఊరువాడ తిరిగానన్నారు. ఉమ్మడి జిల్లాలో తాను అడుగు పెట్టని గ్రామం లేదన్న విషయం గుర్తుంచుకోవాలని, ఫ్లోర్ లీడర్ గా తాను రాష్ట్రంలో తిరగని మండలం లేదని వివక్షకు గురైన కులాల కోసం 40 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేశానన్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా జాతుల అభ్యున్నతి కోసం సుదీర్ఘంగా చర్చలు జరపడంలో తనవంతు పాత్ర పోషించానని వెల్లడించారు. తెలంగాణ బౌగోళికమైన ఏర్పాటు కావడం కాదు వివక్షకు గురవుతున్న జాతుల స్వేచ్ఛ కోసమే తాను తపన పడ్డనని… నా గురించి నీకు తక్కువ తెలుసు బిడ్డా నీకు అంటూ హెచ్చరించారు. అనాడు తాను ఆయా జాతుల గురించి చేసిన సమావేశాల ఫలితమే తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో గురుకులాల ఆవిర్భావం, హైదరాబాద్ లో 78 కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం జరిగిందని ఈటల వెల్లడించారు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్ని చోట్ల ఉంటారని వారి గురించి పట్టించుకోవద్దన్నారు. కార్యకర్తల అవసరాలు తీర్చలేనంత నిస్సాహయ స్థితిలో తాను లేనని తేల్చి చెప్పారు.
హుజురాబాద్ చైతన్యం…
తనను అక్కున చేర్చుకున్న హుజురాబాద్ నియోజకవర్గం ఎంతో చైతన్యవంతమైనదన్న ఈటల తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి వారే కీలక భూమిక పోషించారన్నారు. అనేక త్యాగాలకు, చైతన్యానికి, ముక్కుసూటి తనానిని హుజురాబాద్ అడ్డా అని, సాహసోపేతమైన ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారన్నారు. 72 గంటల పాటు రైల్ రోకో చేయాలన్న పిలుపునందుకుని తుపాకులకు భయపడకుండా ఉద్యమించారన్నారు. మానుకోట రైల్వే స్టేషన్ దాడి ఘటనలో పాల్గొన్న వారిలో హుజురాబాద్ వారే ఎక్కువ మంది పాల్గొన్నారన్నారు. దేశ చరిత్రలో ఏనాడూ లేని విధంగా 6 నెలల పాటు ఎన్నికలు హుజురాబాద్ లో జరిగాయని, 2021 ఉప ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వెచ్చించినా, దళిత బంధు అమలు చేసినా, గొర్లు ఇచ్చినా హుజురాబాద్ బిడ్డలు కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు. ఆనాటి ఉప ఎన్నికల ఫలితాలను ప్రపంచంలోని తెలుగు వారంతా కీర్తించారని చివరకు తెలంగాణ ఆత్మ గౌరవం నిలిచిందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత మీరుణం తీర్చుకోలేనదని ప్రకటించానని, రెండున్నర సంవత్సరాలు నరకం అనుభవించాన్నారు. 2014 ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా తనకు ఎన్ని ఓట్లు వచ్చాయో ఎంపీ అభ్యర్థిగా అని ఓట్లు వచ్చాయని, 2019 ఎన్నికల్లో హిందు గాళ్లు, బొందుగాళ్లని తులనాడినా 53 వేల మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందన్నారు. క్యాడర్ అంటే పడి చచ్చే లీడర్లు ఉంటారని, లీడర్ అంటే పడి చచ్చే క్యాడర్ ఉంటారన్నారు.
అక్కడికి వస్తా…
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్, జమ్మికుంట, హుజురాబాద్, వీణవంకల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, నెలకు రెండు సార్ల వచ్చి మీతో మమేకం అవుతానని ఈటల ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడే ఉంటానని, అక్కడ నా వాళ్లే ఈ ఎన్నికల్లో గెలుస్తారని ప్రకటించారు. నా వాళ్లందరిని గెలిపించుకుంటానని హుజురాబాద్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. తన జోలికి రావద్దని, తనకు అడ్డు రావద్దని వార్నింగ్ ఇచ్చిన ఈటల తుపాను ముందు ప్రశాంతత ఉంటుందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. గ్రామాల్లో ప్రజల అభిమానాన్ని చురగొనే విధంగా నడుచుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వివరాలన్నింటిని పైకి పంపిస్తాను కొడకా… సంస్కరం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరిగడతారని అనుకుంటానని లేనట్టయితే ఎవరు నష్టపోతరో పార్టీ చూసుకుంటుందన్నారు. అసలు నీ శక్తి ఏంటీ… నీ యుక్తి ఏంటీ..? నీ చరిత్ర ఎంటీ… నా చరిత్ర ఎంటి..? 2002లో జిల్లాకు వచ్చానన్నారు. అంటూ ఘాటుగా ప్రశ్నించిన ఈటల రాజేందర్ తన గురించి తెలంగాణాలోని ప్రతి బిడ్డకు తెలుసన్నారు. సైకో శాడిస్టు ఎవడో ఎవరి అండతో ధైర్యం చేశాడోనని వ్యాఖ్యానించారు.