10 చోట్ల దాడులు చేపట్టిన తెలంగాణ ఏసీబీ…
దిశ దశ, వరంగల్:
ప్రైవేటు పాఠశాల రికగ్నైజేషన్ రెన్యూవల్ కోసం లంచం అడిగి పట్టుబడ్డ వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తులు ఆర్జించిన కేసు కూడా నమోదు చేసింది. గత డిసెంబర్ 5న వరంగల్ లో లంచం తీసుకుంటుండగా జిల్లా విద్యాశాఖ ఉద్యోగులు ఇద్దరితో పాటు డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డిని ఏసీబీ ట్రాప్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు వెంకట రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టగా రూ. 30 లక్షల నగదుతో పాటు కొన్ని డాక్యూమెంట్లు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చిన ఏసీబీ అధికారులు డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి అక్రమ ఆదాయం గురించి ఆరా తీసినట్టుగా స్పష్టం అవుతోంది. ఆయన ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, బినామీలు ఎవరూ..? ఆస్తులకు సంబంధించి డాక్యూమెంట్ల వివరాలన్నింటిని కూడా సేకరించిన ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం నుండి దాడులు చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ లోని మొత్తం 10 చోట్ల ఏసీబీ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఏసీబీ చేపట్టిన సోదాలు పూర్తయిన తరువాత సమగ్ర వివరాలు తెలిసే అవకాశం ఉంది.