దిశ దశ, కరీంనగర్:
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ మీడియా సమావేశంలో సహచర మంత్రిపై మరో మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపై దుమారం చెలరేగుతోంది. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై నిరసనల ప్రారంభం అయ్యాయి. ‘‘దున్నపోతు’’ అంటూ మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజీ కాస్తా వైరల్ కాగా సోమవారం తాను అలా అనలేదంటూ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా పొన్నం తీరును తప్పు పడుతు కామెంట్లు వచ్చాయి. ఈ అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం మద్యాహ్నం వరకూ స్పందించిన తరువాత దుమారం పెద్ద ఎత్తున రాజుకుంది. దళిత సంఘాలతో పాటు పలువురు మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యల పట్ల ఆందోళన వ్యక్తం చేయగా, దళితుల పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటున్నాయి. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా జోక్యం చేసుకున్నారంటే దళిత సంఘాల స్పందన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంత్రులిద్దరితో మాట్లాడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్. ఆ తరువాత మంత్రులు పొన్నం, అడ్లూరిలు బుధవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తనను కలవాలని ఈ సందర్బంగా ఆ రోజు జరిగిన పరిణామాలపై చర్చిస్తానని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
అధిష్టానం దృష్టికి….
మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పనట్టయితే అధిష్టానం దృష్టికి తీసుకెల్తానని మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు, ముఖ్య నేతలందరికి జరిగిన విషయంపై వివరిస్తానని స్పష్టం చేశారు. దళిత మంత్రినైన తన పట్ల సహచర మంత్రి ఇలా ప్రవర్తించడం సమజంసం కాదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత వర్గానికి చెందిన మరో మంత్రి వివేక్ కూడా తన పట్ల వివక్ష చూపారని కూడా అడ్లూరి కామెంట్ చేయడం గమనార్హం. వివేక్ తండ్రి వెంకటస్వామి అప్పటి నుండి తనకు సాన్నిహిత్యం ఉందని అయినప్పటికీ ఆయన సానుకూలంగా స్పందించకపోవడం బాధించిందన్నారు. మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన అంశాన్ని వెల్లడించేందుకు మద్యాహ్నం 3.30 గంటల వరకు తాను మీడియా సమావేశం వద్దకు చేరుకుంటానని చెప్పానని, అయితే తాను చేరుకునే క్రమంలోనే మంత్రులు వెల్లిపోతామని అంటున్నారని ఫోన్ వచ్చిందన్నారు. అయితే తాను వచ్చే వరకు వారు ఆగే అవకాశం ఉండదని మీరు సమావేశం కొనసాగించాలని తాను వచ్చి జాయిన్ అవుతానని చెప్పానన్నారు. తాను సామాన్య కార్యకర్త నుండి వచ్చిన వ్యక్తినని, డబ్బులు ఉన్నవాన్ని కాదని, తన తండ్రి కేంద్ర మంత్రి కూడా కాదని కష్టాలు అనుభవించిన వాడినన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ లా ఉద్రేకపూరితంగా మాట్లాడేంత శక్తిమంతుడిని కూడా కాదని తాను 3.40 నిమిషాలకు మీడియా సమావేశం వద్దకు చేరుకున్నానని లక్ష్మణ్ కుమార్ వివరించారు. వారితో పాటు కలిసి కూర్చోవడం వారికి ఇష్టం లేదని, మొదటీ నుండి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాడని వివేక్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అడ్లూరిని ఉద్దేశించి అనలేదు…
అయితే ఈ విషయంపై పీసీసీ చీఫ్ తో పాటు ఇతర పెద్దలందరితో తాను మాట్లాడానని, మంత్రి అడ్లూరితో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన టచ్ లోకి రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు. తాను ఎవరినీ ఏమీ అనలేదని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కుట్ర అని ఆరోపించారు. గతాను అన్న మాటాలను వక్రీకరించారని, బుధవారం పీసీసీ చీఫ్ ను కలిసి అన్నీ విషయాలు వివరిస్తానని పొన్నం వెల్లడించారు.
దళిత సంఘాల ఆందోళన…
మంత్రి అడ్లూరి పట్ల సహచర మంత్రులు వ్యవహరించిన తీరు సరికాదంటూ దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. కరీంనగర్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి మంత్రి పొన్నం వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నిరసనలు చేపట్టగా, ఎమార్పీస్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. బుధవారం పీసీసీ చీఫ్ తో భేటీ తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.