దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంలు కూలిపోయాయా లేక ధ్వంసానికి గురయ్యాయా అన్న విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల నడుమ గుంపుల, తనుగుల చెక్ డ్యాం నవంబర్ 21న కూలిపోగా, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నడుమ అడవి సోమన్ పల్లి, వల్లెంకుంట వద్ద నిర్మించిన చెక్ డ్యాం డిసెంబర్ 17వ తేదిన కూలిపోయింది. ఇసుక మాఫియానే ఈ రెండింటిని పేల్చివేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలకు దిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చెక్ డ్యాంల అంశాన్ని ప్రస్తావిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని పేల్చివేసిన వాళ్లను పాతాళంలో ఉన్నా పట్టుకుని తీరుతామన్నారు. చెక్ డ్యాంలు కావాలనే కూల్చారా లేక సహజంగానే కూలిపోయాయా అన్న విషయంపై స్పష్టత రావల్సిన అవసరం ఉందని భావించిన ప్రభుత్వం విజిలెన్స్ విభాగం ద్వారా విచారణ చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. చెక్ డ్యాంల నిర్మాణ సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా అన్న విషయంతో పాటు, కావాలనే వాటిని ధ్వంసం చేశారా అన్న విషయంపై సమగ్రంగా విచారణ జరపాలని ఆదేశించామన్నారు. చెక్ డ్యాంలు కూలిపోయిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని స్పష్టం చేసినట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
పోలీసుల దర్యాప్తు…
అయితే చెక్ డ్యాంలు కూలిపోయిన విషయంపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆయా స్టేషన్ పరిధిలోని అధికారులు. తనుగుల చెక్ డ్యాం ఘటనపై జమ్మికుంట పోలీసులు, అడవి సోమన్ పల్లి చెక్ డ్యాం ఘటనపై కొయ్యూరు పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు చోట్ల కూడా ఫోరెన్సిక్ లాబోరేటరీ (FSL) అధికారులు కూడా క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన నివేదికలను సంబంధిత జిల్లాల పోలీసు అధికారులకు చేరాల్సి ఉంది. అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించడంతో చెక్ డ్యాంల నిర్మాణ స్థలాలు, ఇందు కోసం ఉపయోగించిన మెటిరియల్, డెప్త్ తదితర అంశాలపై విజిలెన్స్ అధికారులకు కులంకశంగా అధ్యయనం చేయనున్నారు.
రెండు రోజుల క్రితం…
పెద్దపల్లి జిల్లా అడవి సోమన్ పల్లి చెక డ్యాం విషయంలో మంథని కాంగ్రెస్ నాయకులు రెండు రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ శ్రీ హర్షకు ఫిర్యాదు చేశారు. చెక్ డ్యాం కూలిపోయిన విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు విరుద్దమైన ప్రకటనలు చేస్తున్నారని… అయితే చెక్ డ్యాం కూలిపోవడానికి గల అసలు కారణాలు ఏంటీ అన్న విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని మంథని కాంగ్రెస్ నాయకులు అయిలి ప్రసాద్, కుడుదుల వెంకన్న, మంథని సత్యం, ఎరుకల ప్రవీణ్, శశి భూషన్ కాచె, ఊదరి శంకర్, అరెల్లి కిరణ్, గుమ్మడి సమ్మయ్యలు జిల్లా కలెక్టర్ ను కోరారు.