చెన్నూరు కాంగ్రెస్ పార్టీలో కలకలం…మూల రాజిరెడ్డి రాజీనామా..!

బీఆరెఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు..? 

దిశ దశ, చెన్నూరు: 

కీలకమైన సమయంలో మంచిర్యాల జిల్లాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేసింది స్థానిక ముఖ్య నాయకత్వం. మునిసిపల్ ఎన్నికల వేళ పార్టీలో ప్రతికూలత బయటకు రావడం వల్ల ఎలాంటి ఫలితాలు చవిచూడవల్సి వస్తుందోనన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. 

రిజ్వరేషన్లు… రాజీనామా…

శనివారం మునిసిపల్ వార్డులు, ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే చెన్నూరు కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం తెరపైకి రావడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వెన్నుదన్నుగా నిలిచిన మూల రాజిరెడ్డి తన అనచరులతో సహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖలను కూడా మీడియాకు విడుదల చేసిన రాజిరెడ్డి తన అనుచరులతో చర్చలు జరిపిన తరువాత ఏ పార్టీలో చేరేది అన్న అంశంపై స్ఫష్టత ఇస్తానని వెల్లడించారు. కొంతకాలంగా వివేక్ తో సఖ్యత లేకున్నప్పటికీ రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండడంతో ఆయన పార్టీ వీడే అవకాశం లేదని భావించారంతా. సమావేశాల్లో కూడా రాజిరెడ్డి వర్గానికి ప్రాధాన్యత కల్పించడం లేదని నిరసనలు వ్యక్తం అయిన తరువాత కూడా అదే పార్టీలో కొనసాగడంతో అధిష్టానం పెద్దల ఆశీస్సులతో రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 

భారీ స్కెచ్…

మూల రాజిరెడ్డి తన అభిమానులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నుండి వీడనున్నట్టుగా వెల్లడించారు. మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా రాజిరెడ్డి తన శిబిరంలోకి చేర్పించుకునేందుకు పావులు కదుపుతున్నట్టుగా స్థానికంగా ప్రచారం. రాజిరెడ్డితో సాన్నిహిత్యంగా ఉన్న వారే కాకుండా అధికార పార్టీలో వివక్షకు గురవుతున్న వారందరితోనూ మంతనాలు చేయనున్నట్టుగా సమాచారం. మునిసిపల్ ఎన్నికల్లో వివేక్ అంచనాలు తలకిందులు చేసినట్టయితే తన ప్రభావం ఏంటీ..? తనను విస్మరించడం వల్ల ఎదురయ్యే ప్రతికూలత ఏంటీ అన్నది చేతల్లోనే చూపించాలని మూల రాజిరెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం.

పూర్వశ్రమంలోకి..?

చెన్నూరు సీనియర్ నాయకుడు మూల రాజిరెడ్డి తన వర్గీయులందరితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో సమీకరణ చేసి తెలంగాణ భవన్ లో గులాబి కండువా కప్పుకునే విషయంలో సమాలోచనలు జరుపుతున్నట్టుగా సమాచారం.  హైదరాబాద్ లో నిర్వహించబోయే ఈ జాయినింగ్ ప్రోగ్రాంతో తానేంటో నిరూపించాలన్న యోచనలో ఉన్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. 200 కార్లలో హైదరాబాద్ వెల్లి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తిరిగి అదే గూటికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా మునిసిపల్ ఎన్నికల సమయంలో మూల రాజిరెడ్డితో పాటు  పలువురు కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకోవడం స్థానికంగా చర్చకు దారి తీసింది.

CHENNUR NEWSCONGRESS PARTYGADDAMTG NEWSVIVEK