నష్టపోతామంటున్న జీహెచ్ఎంలు…
దిశ దశ, హైదరాబాద్:
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీని పక్కనపెట్టి కొత్త పద్దతిని అవలంభించాలన్న ప్రతిపాదనలపై విద్యాశాఖలో విస్మయం వ్యక్తం అవుతోంది. పదోన్నతులకు ముందు బదిలీల ప్రక్రియ చేపట్టాలన్న పద్దతిని మరుగున పెట్టే యోచనలో ఉండడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకాలం అమలు చేసిన పద్దతులనే ఈ సారి కూడా పాటించాలని లేనట్టయితే తీరని నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
తీరని అన్యాయం…
సుదీర్ఘ కాలం తరువాత 2023లో రాష్ట్రంలోని స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. రాష్ట్రంలోని రెండు మల్టీజోన్ ల పరిధిలోని 1800 నుండి 2 వేల మందికి గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతి కల్పించారు. అప్పుడు అధికారులు పదోన్నతులు పొందే వారు తాము బదిలీ చేసిన చోటకు వెళ్లాలన్న కండిషన్ విధించడంతో ఇందుకు సమ్మతించారు. అప్పటి వరకు జిల్లా క్యాడర్ గా ఉన్న గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్టును ఒకే సారి మల్టీజోన్ పోస్ట్ గా మార్చేశారు. సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు భవిష్యత్తులో ప్రమోషన్ అందుకుంటామో లేదోనన్న ఆవేదనతో అధికారులు చెప్పినట్టుగా నడుచుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కాలం తరువాత పదోన్నతులు దక్కుతుండడంతో మల్టీజోన్ పరిదిలోని సుదూర జిల్లాలకు వెల్లేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసి విధుల్లో చేరారు. మల్టీజోన్ 2 పరిధిలో చూసుకున్నట్టయితే కొంతమంది జీహెచ్ఎంలు దాదాపు 400 కిలోమీటర్ల దూరానికి బదిలీ చేసినా అక్కడ విధుల్లు చేరారు. చాలా కాలం తరువాత పదోన్నతులు దక్కుతున్నాయన్న ఆనందంతో స్కూల్ అసిస్టెంట్లు ఎంత దూరం బదిలీ చేసినా వెనకడుగు వేయలేదు. అప్పటి నుండి పోస్టింగ్ పొందిన చోటే విధులు నిర్వర్తిస్తున్నారు ప్రమోషన్ అందుకున్న గెజిటెడ్ హెడ్ మాస్టర్లు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలోని అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అయితే ఈ సారి మాత్రం పదోన్నతులు కల్పించాలి కానీ బదిలీలు చేయకూడదని ఉన్నతాధికారులను అభ్యర్థిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు కొంతమంది లాబీయింగ్ చేస్తూ పావులు కదుపుతున్నారన్న చర్చ విద్యాశాఖ వర్గాల్లో సాగుతోంది. 2023లో పదోన్నతులతో పాటు మల్టీజోన్ పరిధిలోని 19 జిల్లాలకు బదిలీ చేస్తే ఇప్పుడు మాత్రం ప్రమోషన్లు మాత్రమే ఇచ్చి బదిలీలే చేయకూడదన్న ప్రతిపాదన తెరపైకి తీసుకవస్తున్నారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతామని 2023లో పదోన్నతి పొందిన జీహెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు అమలు చేసిన విధానాన్నే ఇప్పుడు కూడా పాటించాలని కోరుతున్నారు. ఐదు దశాబ్దాలుగా బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత పదోన్నతులు కల్పించే సాంప్రాదాయం కొనసాగిందని ఇప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు సాగాలని అభ్యర్థిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ప్రమోషన్ పొంది బదిలీ అయిన తమను అదే జిల్లాలకు పరిమితం చేసి ఇప్పుడు పదోన్నతి పొందే వారికి మాత్రం కొత్త నిబంధనల అమలు చేయడం వల్ల రిటైర్ అయ్యే వరకూ కూడా తాము సొంత జిల్లాల ముఖం చూసే పరిస్థితి ఉండదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రమోషన్ల విషయంలో పాత పద్దతులను పాటించేందుకే మొగ్గు చూపాలని 2023లో పదోన్నతి పొందిన గెజిటెడ్ హెడ్ మాస్టర్లు కోరుతున్నారు. దీనివల్ల తాము సొంత ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. తమతో పాటు పదోన్నతికి అర్హత పొందిన వారు అప్పుడు విముఖత వ్యక్తం చేయడంతో ఇప్పుడు పదోన్నతి పొందే సీనియారిటీ జాబితాలో ముందు ఉన్నారని వారికి మాత్రం పనిచేసే చోటే పదోన్నతి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖలో పదోన్నతులు కల్పించే విషయంలో కొత్త నిబంధనల తెరపైకి తీసుకరాకుండా పాత పద్దతులను పాటించడంతో పాటు, 2023లో మల్టీజోన్ లెవల్ క్యాడర్ గా మార్చిన జీహెచ్ఎం పోస్టును ఇప్పుడు జిల్లా క్యాడర్ కే పరిమితం చేయడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు 2023లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు సాగాలని, ముందుగా బదిలీలకు శ్రీకారం చుట్టి పదోన్నతులు కల్పించాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.
మంత్రికి వినతి…
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ హెడ్ మాస్టర్ల ప్రమోషన్ల విషయంపై ఆలోచన చేస్తున్న ప్రభుత్వం తమ గురించి కూడా ఆలోచించాలని జీహెచ్ఎంలు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వినతి చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథనిలో పర్యటించిన మంత్రిని కలిసిన వారు కొత్త నిబంధనలు కాకుండా గతంలో అమలు చేసిన విధానాలనే పాటించేందుకు చొరవ చూపాలని కోరారు. లేనట్టయితే సుదూర ప్రాంతాల్లో పని చేసేందుకు అప్పుడు సుముఖత వ్యక్తం చేసిన తామంతా కూడా పదవి విరమణ వరకు అక్కడే ఉండిపోవల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా ఖాలీలను గుర్తించి బదిలీల ప్రక్రియ చేపట్టిన తరువాత పదోన్నతులు కల్పించాలని కూడా వారు మంత్రి శ్రీధర్ బాబును అభ్యర్థించారు. ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని మంత్రి శ్రీధర్ బాబు వారికి హామీ ఇచ్చారు.