వావిలాపల్లిలో విషాదం…
దిశ దశ, కరీంనగర్:
దివ్యాంగులుగా జన్మించడమే ఆ అన్నా చెల్లెల్లకు శాపంగా మారిందా..? వారికి చికిత్స చేయించినా ఫలితం లేదని భావించిన కన్న తండ్రే వారిని హతమార్చాడా..? కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. సంఘటనా వివారల్లోకి వెలితే… మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన మల్లేశం కుటుంబం కొంతకాలంగా కరీంనగర్ లోని వావిలాలపల్లిలో ఉంటూ కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తోంది. మల్లేశంకు అశ్రిత్ (17), అర్చన (16) అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. దివ్యాంగులైన వీరిద్దరూ శనివారం సాయంత్రం అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా తల్లి పోశవ్వ గమనించి ఆసుపత్రికి తరలించగా కూతురు అర్చన మరణించిందని వైద్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న అశ్రిత్ కు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే అశ్రిత్, అర్చనలను తండ్రి మల్లేశం గొంతు నులిమి చంపే ప్రయత్నం చేయగా వారిలో ఒకరు చనిపోగా, మరోకరు అపస్మారక స్థితిలో కొట్టుమిట్లాడుతున్నారని పేర్కొంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మల్లేశం కోసం గాలిస్తున్నామని కరీంనగర్ టౌన్ ఎసీపీ వెంకటస్వామి తెలిపారు. త్రీ టౌన్ సీఐ జాన్ రెడ్డి ఆద్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని అనుమానితుడిని విచారించినట్టయితే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
పది రోజులుగా..?
అయితే దివ్యాంగులుగా జన్మించిన అశ్రిత్, అర్చనల ఆరోగ్యం బాగు చేయించేందుకు తల్లిదండ్రులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టుగా తెలిసింది. ఇటీవలే తిరుపతిలోని స్పెషలిస్ట్ వైద్యుల వద్ద కూడా చికిత్స చేయించేందుకు తీసుకెళ్లినప్పటికీ వారు బాగయ్యే అవకాశాలు లేవని అక్కడి వైద్యులు చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అప్పటి నుండి మానసిక వేధనకు గురవుతున్న మల్లేశం నడవడికలో మార్పు చోటు చేసుకుందని పోలీసుల విచారణలో తేలినట్టుగా సమాచారం. దీంతో ఆయనను పట్టుకుంటే పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న అశ్రిత్ తేరుకున్నా కూడా అసలు విషయం తెలియనుంది. పోలీసులు మల్లేశం ఆచూకి కోసం ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.