CRIME: తండ్రి… తనయుడు… తమ్ముడు…

ఒకే కుటుంబంలో ముగ్గురు దొంగలు…

వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసిన పోలీసులు

దిశ దశ, కరీంనగర్:

ఆ కుటుంబంలో ముగ్గురు కూడా చోరీలకు పాల్పడడమే వృత్తిగా పెట్టుకున్నట్టుగా ఉంది. ఒకే నెలలో వేర్వేరు కేసుల్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు తండ్రి, తనయుడు, తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఈ నెల 4న కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఎల్ఎండీ పోలీసులు టేకు చిరంజీవి (22)ను అరెస్ట్ చేయగా, బుధవారం చిరంజీవి తండ్రి టేకు గంగ సాయిలు (55), అతని సోదరుడు టేకు భూమయ్య (48)లను అరెస్ట్ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం దొంగల అరెస్ట్ కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం… నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం దీకంపల్లికి చెందిన గంగ సాయిలు, అతని తమ్ముడు టేకు భూమయ్యలు కరీంనగర్ కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. వీరు నిర్మల్ కు చెందిన ఉప్పుల వేణు ద్వారా మహారాష్ట్రలోని షోలాపూర్ కు నివాసి, ప్రస్తుతం నిర్మల్ జిల్లా మంజులాపూర్ లో స్థిరపడ్డ ఎక్నాత్ శేల్కే (34)కు చోరీ సొత్తును విక్రయించే వారు.

రికవరీ….

టేకు బ్రదర్స్ నుండి TS-16-FJ-2043 నంబర్ గల బైక్, రామడుగు స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడిన 5 గ్రాముల బంగారం, 40 గ్రాముల వెండి, రూ. 20 వేలు చోరీ చేయగా పోలీసులు రికవరీ చేశారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 10 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, రూ. 40 వేల నగదు, మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 25 గ్రాముల బంగారం, కిలో వెండి, రూ. 30 వేల నగదు చోరీకి గురైన సొత్తునంతా పోలీసులు రికవరీ చేశారు. గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 2 లక్షల నగదు, ఇత్తడి పాత్రలు, 5 గ్రాముల బంగారం చోరీ చేయగా రూ. 50 వేలు నగదుతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంతో పాటు చోరీకి గురైన సొత్తు, నగదును రికవరీ చేయడంలో కీలక భూమిక పోషించిన కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీసీఎస్ ఏసీపీ జాన్ నరసింహులు, సీఐలు సంజీవ్, ప్రకాష్, ఎస్ఐ స్వాతి, కానిస్టేబుళ్లు హేమ సుందర్, శ్రీనివాస్, రాజశేఖర్, శేఖర్ లను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అభినందించారు.

CP KARIMNAGAARcrime newskarimnagar crimekarimnagar newstelangana crime