Maoist News: ఎగువన ఆత్మరక్షణ దళం… దిగువన మావోయిస్టు దళం…

అమర వీరుల వారోత్సవాల తొలిరోజు…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాల్లో తొలిరోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. గోదావరి తీరంలోని గ్రామాల్లో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలియగా, మరోచోట అమర వీరుల వారోత్సవాలు విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రత్యక్ష్యం అయ్యాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఎన్ కౌంటర్ లలో చనిపోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. అయితే గతంలో కేవలం పోలీసులు అప్రమత్తత చర్యలు తీసుకుంటూ సరిహద్దు గ్రామాల ప్రజలను చైతన్య పరిచేందుకు కార్యక్రమాలు చేపట్టే వారు. కానీ ఈ సారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పేరుతో కరపత్రాలు ప్రత్యక్ష్యం కావడం గమనార్హం. జిల్లాలోని పలిమెల మండలం ముకునూరు. నీలంపల్లి, బూరుగు గూడెం, సర్వాయిపేట తదితర గ్రామాల్లో ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ పేరిట కరపత్రాలు వెలిసాయి. సిద్దాంతం కోసం అడవి బాట పట్టిన అన్నలు, అక్కలు మీరు నమ్మిన సిద్దాంతం సామాన్యులకు ఆశా కిరణం ఎప్పుడైంది..? మావోయిస్టు అగ్ర నాయకులారా కాలం చెల్లిన సిద్దాంతాలను వీడి జన జీవనంలో కలవండి. మీ మేధస్సును ప్రజల అభ్యున్నతి కోసం ఉపయోగించండని పిలుపునిచ్చింది. మరో వైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం కొత్తగూడెం సమీపంలోని ప్రధాన రహదారిపై మావోయిస్టు పార్టీ బ్యానర్లను ఏర్పాటు చేసింది. రోడ్లపై కరపత్రాలను కూడా వదిలేశారు. జులై 28 నుండి ఆగస్టు 3 వరకు నక్సల్స్ వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు మావోయిస్టులు. భారీ ఉద్యమాల ద్వారా ఆపరేషన్ కగార్ ను తిప్పి కొట్టగలుగుతామన్న విషయాన్ని గుర్తించాలని మావోయిస్టు పార్టీ కోరింది. అయితే పోలీసులు బ్యానర్లను, కరపత్రాలను తొలగించేశారు.

bhadradri kothagudemchhattisgarhDANDAKARNYAMgodavarimaoist news