నక్సల్ రహిత రాష్ట్రంగా తెలంగాణ…
అధికారులకు అభినందన…
దిశ దశ, దండకారణ్యం:
వామపక్ష నక్సలిజం వల్ల ఐదు దశాబ్దాలకు పైగా దేశం సవాళ్లను ఎదుర్కొందని… నక్సలిజం అంతరించిపోవడంతో ప్రభావిత ప్రాంతాల్లో అభ్యున్నతి కొనసాగనుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 1970 నుండి 2026 వరకు నక్సల్స్ కార్యకలాపాలతో ప్రతికూలతను ఎదుర్కొన్నామన్నారు. చత్తీస్ గడ్ లోని జగ్దల్ పూర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తమ సొంత రాష్ట్రమైన గుజరాత్ సహ దేశంలోని పలు రాష్ట్రాలు నక్సల్ సమస్యను ఎదుర్కొన్నాయన్నారు. 20024 జనవరిలో జరిగిన అంతర్గత సమావేశంలో వామపక్ష విప్లవాన్ని నిర్మిలించేందుకు 2026 మార్చి 31 లక్ష్యంగా పెట్టుకున్నామని అయితే టార్గెట్ రీచ్ కావడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర బలగాలు సమన్వయంతో మావోయిస్టులను నిర్మూలించడంలో సఫలం అయ్యాయని కితాబిచ్చారు. స్పష్టమైన దార్శినికతతో పక్కా వ్యూహంతో ముందుకు సాగడంతోనే మావోయిస్టు పార్టీ నిర్మూలన సాధ్యమైందన్నారు. దంతేశ్వరీ మాత ఆశీస్సులతో బస్తర్ మావోయిస్టు రహిత ప్రాంతంగా ప్రకటిస్తుండడం సంతోషకరంగా ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు రక్త పాతాన్ని, అభివృద్ది స్తబ్దతను, యువత భవిత పట్ల అనిశ్చితిని చవిచూశాయని ఈ వ్యవస్తను నిర్మూలించడంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన వారు అత్యున్నతమైన త్యాగాలు చేశారని కొనియాడారు.
గ్రేట్ తెలంగాణ…
తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. నక్సల్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణాను తీర్చిదిద్దడంలో సఫలం అయ్యారన్నారు. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంతో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, డీజీపీ సివి ఆనంద్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ డీజీ డాక్టర్ అనిల్ కుమార్, SIB IGగా పని చేసిన ప్రస్తుత మల్కాజ్ గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు పోలీసు అధికారులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘనంగా సన్మానించారు.