కొండంత రాగం తీసిన కాంగ్రెస్… క్యాంపు నుండి బయటకొచ్చిన బీఆర్ఎస్…

దిశ దశ, కరీంనగర్:

ఏదో చేద్దామన్న ఆతృతలో అధికార కాంగ్రెస్ పార్టీ చతకిలపడిపోయిందా..? కూటమి ఏర్పాటు  కోసం మొదట్లో చూపిన అత్యుత్సాహం చివరి వరకూ కొనసాగించలేకపోయిందా..? సానుకూల ఫలితం అందిపుచ్చుకునేందుకు సమీకరణాలు చేయడంలో విఫలం అయిందా..? అంటే అవుననే  తెలుస్తోంది.

తెల్లవారే వరకూ…

ఊహించని రీతిలో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని చావు దెబ్బ కొట్టాలన్న ప్రయత్నంలో సెల్ఫ్ గోల్ అయినట్టుగానే కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అనుకూలంగా ఉంటేనే తప్ప కార్పొరేషన్ కైవసం చేసుకునే పరిస్థితి లేదని గమనించిన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది కార్పొరేటర్లను కూడా సమీకరించారు. అయితే రెండు రోజులుగా శిబిరాన్ని నిర్వహించి మ్యాజిక్ ఫిగర్ చేరుకునే వరకూ పావులు కదిపిన కాంగ్రెస్ పార్టీ చివరి క్షణంలో మాత్రం విఫలం అయిపోయింది.

బయటకొచ్చిన బీఆర్ఎస్…

బీజేపీకి పోటీగా ఏర్పాటు చేసిన క్యాంపు నుండి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. సోమవారం తెల్లవారు జాము వరకూ శిబిరంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో గులాభి పార్టీ కూటమికి సానుకూలంగా వ్యవహరించేది లేదని తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియలో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసేది లేదని తేల్చి చెప్పినట్టుగా సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్ని విఫలం అయిపోయాయి.

బీజేపీకి లైన్ క్లియర్…

కూటమి శిబిరంలో నెలకొన్న పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారిపోయినట్టేనని స్పష్టం అవుతోంది. బీజేపీ కార్పొరేటర్లు 30 మంది, స్వతంత్రులు ముగ్గురు, ఎక్స్ అఫీసియో సభ్యునిగా ఎంపీ బండి సంజయ్ ఓటుతో ఆ సంఖ్య 34కు చేరుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సమావేశానికి హాజరైన సభ్యుల అధారంగా 51 శాతం ఓట్లు సాధించుకున్న బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకోవడం లాంఛనప్రాయమే. 

2026 elections2026 Municipal ElectionskarimnagarLatest Newsmuncipal elections
Comments (0)
Add Comment