మొన్న వదిలేశారు… నిన్న మళ్లీ వచ్చింది… డంప్ యార్డ్ కథ ఏంటి..?

దిశ దశ, మానకొండూర్:

నాలుగైదు రోజుల క్రితం పట్టుకుని డంప్ యార్డ్ షెడ్డులో నిలిపివేసిన ట్రాక్టర్ ను గురువారం రాత్రి మునిసిపల్ అధికారులు వదిలేశారు. ఈ ట్రాక్టర్ లో తరలిస్తున్న మెడికల్ వేస్టేజ్ ని డంప్ యార్డ్ లో దింపేందుకు వచ్చిందన్న కారణంతో పట్టుకున్నారు. ఈ ట్రాక్టర్ లో తరలించిన మెడికల్ వేస్టేజ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారోనన్న విషయంపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. కానీ అదే ట్రాక్టర్ శుక్రవారం మళ్లీ డంప్ యార్డ్ లో దర్శనం ఇచ్చింది. వేస్టేజ్ మెటీరియల్ తీసుకొచ్చిన ఈ ట్రాక్టర్ కరీంనగర్ సమీపంలోని ప్రముఖ వైద్యశాలకు చెందినదిగా తెలుస్తోంది. సదరు ఆసుపత్రిలో సేకరించిన సాధరణ చెత్తతో పాటు మెడికల్ వేస్టేజ్ కూడా డంప్ యార్డ్ కు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారం డంప్ యార్డ్ కు చేరుకున్న అదే ట్రాక్టర్ ను మునిసిపల్ సిబ్బంది మళ్లీ నిలిపివేశారు. 

మమకారమా..? 

అనారోగ్యం బారిన పడిన వారికి చికిత్స కోసం ఉపయోగించిన మెడికల్  వేస్టేజ్ డంప్ యార్డ్ కు తరలిస్తున్న తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మునిసిపల్ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం వల్లే మెడికల్ వేస్టేజ్ కూడా ఈ డంప్ యార్డ్ కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ పనిచేస్తున్న మునిసిపల్ సిబ్బంది కూడా అనారోగ్యానికి గురయ్యే  ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ చెత్తతో పాటు మెడికల్ వేస్టేజ్ ఇక్కడికే చేరుస్తుండడం వల్ల అన్నిరకాలుగా ఇబ్బందిగా మారనుందని అంటున్నారు స్థానికులు.

మానేరు తీరం.. 

కరీంనగర్ శివార్లలోని డంప్ యార్డు మానేరు నది తీరంలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. డంప్ యార్డ్ కారణంగా సమీప కాలనీ వాసులు కంటిమీద కునుకు లేకుండా జీవనం సాగిస్తున్నారు. డంప్ యార్డులో మంటలు చెలరేగినప్పుడు అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా మారిపోతోంది. ఆయా కాలనీల్లోని వృద్దులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడే మెడికల్ వేస్టేజ్ కూడా వేస్తుండడం మరింత ప్రమాదకరమని స్థానికులు అంటున్నారు. అయితే ఈ డంప్ యార్డ్ వల్ల కేవలం స్థానికులకే కాకుండా మానేరు నదిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. మానేరు జలాలు కలుషితం కావడంతో పాటు, మెడికల్ వేస్టేజ్ కూడా ఈ నీటిలో కొట్టుకపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మానేరు నీటిలో ఉండే జీవ రాశుల ఉనికికి కూడా ఇబ్బందికరం కానుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Bio wastedump yardkarimnagarLatest NewsMedical waste
Comments (0)
Add Comment