దిశ దశ, చెన్నూరు:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ ప్రక్రియ అంతా సాఫీగా జరిగినప్పటికీ కౌంటింగ్ ముగిసిన తరువాత ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఆయా చోట్ల పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. చెన్నూరు మండలం బావురావుపేటలో కాంగ్రెస్, రెబెల్ అభ్యర్థికి మధ్య హోరాహోరి పోరు జరిగింది. రెండు ఓట్ల తేడాతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో రెబెల్ అభ్యర్థికి చెందిన అనుచరులు ఒక్క సారిగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకుని వెళ్లారు. గేటు విరగగొట్టి మరీ కౌంటింగ్ కేంద్రంలోకి చొచ్చుకపోవడంతో పోలింగ్ అధికారులు స్వీయ రక్షణ కోసం ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. పోలీసులు బూత్ వద్దకు చేరుకుని ఆందోళణ కారులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపున జైపూర్ మండలం మిట్టపల్లిలోనూ ఉద్రిక్తత నెలకొంది. మద్యాహ్న 2 గంటలకు ప్రారంభించాల్సినప్టపికీ అధికారులు జాప్యం చేసి బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో కౌంటింగ్ కేంద్రం ముందు బైఠాయించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీ పోటిగా నినాదాలు ఇవ్వడంతో మిట్టపల్లి పంచాయితీ కౌంటింగ్ కేంద్రం వద్ద రచ్చ రచ్చ నెలకొంది. అలాగే జైపూర్ మండలంలోని పెగడపల్లిలో స్వతంత్ర అభ్యర్థి ఆకుదారి రాము విజయం సాధించినా ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించడం లేదని కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థి రాము అనుచరులు నిరసన తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బల పర్చిన అభ్యర్థి కోరడంతో మూడు సార్లు రీ కౌంటింగ్ చేశారని అయినా ఫలితం ప్రకటించకపోవడం వెనక ఆంతర్యం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు ఇస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.