లూప్ లైనా… లైమ్ లైటా..?

ఆరోపణల అధికారికి ఈఓగా పోస్టింగ్

దేవాదాయ శాఖలో విచిత్రం…

దిశ దశ, జగిత్యాల:

ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ జరుగుతున్న క్రమంలో వారికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వాలి? లూప్ లైన్ పోస్టింగ్ కు బదిలీ చేసి విచారణ జరపాల్సి ఉంటుందా? దేవాదాయ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం మాత్రం అత్యంత విచిత్రంగా ఉందనే చెప్పాలి. సాధారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని కీలక బాధ్యతల నుండి తప్పించి అప్రాధాన్యత పోస్టింగుతో సరి పెడుతుంటారు. అయితే దేవాదాయ అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ సాగుతోంది. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు విమర్శలకు దారి తీస్తున్నాయి.

ఆరోపణల అధికారి…

వరంగల్ ఎండోమెంట్స్ విభాగంలో డిప్యూటీ కమిషనర్ హోదాలో పని చేస్తున్న T శ్రీకాంత్ రావుపై ఆరోపణలు వచ్చాయి. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న సహచర మహిళా ఉద్యోగులను వేదింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖకు చెందిన మహిళా అధికారులు దేవాదాయ శాఖ మంత్రికి, ఎండోమెంట్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు తీరుపై విచారణ జరపాలని నిర్ణయించారు. దీంతో ఆయనను వరంగల్ నుండి బదిలీ చేయాలని నిర్ణయించిన అధికారులు Gort No. 7 విడుదల చేశారు. ఈ మేరకు శ్రీకాంత్ రావును జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అసలు ట్విస్ట్…

మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను అప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న శ్రీకాంత్ రావుకు మాత్రం ప్రాధాన్యత పోస్టింగ్ ఇవ్వడం దేవాదాయ శాఖలో చర్చనీయాంశంగా మారింది. విచారణ పూర్తయ్యే వరకూ కూడా లూప్ లైన్ వింగ్స్ డ్యూటీకి పరిమితం చేయకుండా అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రముఖ క్షేత్రానికి బదిలీ చేయడం సంచలనంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ప్రధాన ఆలయ ఈఓ బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు స్థానికులు. నిరంతరం భక్తుల సేవలో నిమగ్నం కావల్సి ఉన్న చోటకు బదిలీ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఆలయ ఈఓగా పోస్టింగ్ ఇవ్వడం సరి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

endomentskarimnagar newskonda surekhakondagattutelangana news