అల్ఫోర్స్ ఇ-టెక్నొ స్కూల్ లో గణిత దినోత్సవ వేడుకలు

గణితం ఒక జీవితం… గణితంతోనే విజయాలు సాధ్యం…

అవధాని ఇ చంద్రయ్య

దిశ దశ, కరీంనగర్:

గణిత శాస్త్రం అత్యంత కీలకమైనదని, విజయాలకు నాంది పలుకుతుందని  అవధాని, ప్రముఖ గణిత ఉపాధ్యాయులు ఈ చంద్రయ్య అన్నారు. స్థానిక కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి, గణిత దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీనివాస రామానుజన్ చిన్ననాటి నుండి గణిత శాస్త్రం పట్ల మక్కువ పెంచుకొని నూతన ఒరవడికి నాంది పలికారని… వారు చేసిన సేవలు చారిత్రాత్మకమైనవని అన్నారు. నేటికి నిష్ణాతులైన గణిత శాస్త్రవేత్తలు రామానుజన్ రూపొందించిన సూత్రాలకు పరిష్కారం చూపలేక పోతున్నారన్నారు.‌ తమిళనాడులో జన్మించిన రామానుజన్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆయన వలె అంకిత భావాన్ని, ఏకాగ్రతను పెంపొందించుకుని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని చంద్రయ్య పిలుపునిచ్చారు. చిన్నతనంలోనే గణిత శాస్త్రంలోని విషయాలను సమగ్రంగా పరిశీలించి పరిశోధనాత్మకంగా నూతన విషయాలను కనుగొని నిష్ణాతులైన గణిత శాస్త్రవేత్తలకి ఆశ్చర్యం అనిపించారన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు గణిత శాస్త్రం పట్ల మక్కువ కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటుండడం అభినందనీయమన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అత్యుత్తమమైన ప్రణాళికలతో విద్యను అందిస్తున్నతీరు ఆదర్శప్రాయమన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… సమాజంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని విద్యా విధానాన్ని, బోధించే పద్ధతులపై ఎప్పటికప్పుడు పట్టు బిగిస్తూ… విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిచండం తమ సంస్థల ప్రత్యేకత అన్నారు. విద్యార్థులకు గణిత శాస్త్రం పట్ల ప్రత్యేక శ్రద్ద ఉండాలని మ్యాథ్స్ ద్వారా వివిధ స్థాయిలలో నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారన్నారు. చక్కటి సాధనతో పాటు ఏకాగ్రతతో ముందుకు సాగే వారు గణితంలో అద్భుతాలు సృష్టించడమే కాకుండా ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అవకాశాలు అందివస్తాయన్నారు. రామానుజన్ బోధించినటువంటి విషయాలు చాలా అమూల్యమైనవని ఆయన రూపొందించిన సూత్రాలను నేటికీ పాటిస్తుండండం రామానుజన్ మేధస్సుకు గొప్ప నిదర్శనమన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు ప్రతిసాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించడమే లక్ష్యంగా గణితం బోధిస్తున్నామని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు, గణిత శాస్త్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను సన్మానించడం తన అదృష్టంగా భావిస్తున్నామని వి నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వివిధ పాఠశాలల యజమానులు పాల్గొన్నారు.

alphores CollegesAlphores Narender ReddyMATHS DAYRamanujan's Birthday