మొన్న సతి… నేడు పతి… భార్యా భర్తల ఆత్మహత్య: ఎస్సై కుటుంబంలో విషాదం…

దిశ దశ, జమ్మికుంట:

ఐదు రోజుల క్రితం భార్య ఆత్మహత్య… నేడు భర్త ఆత్మ హత్య చేసుకోవడంతో ఎస్సై కుటుంబంలో విషాదం అలుముకుంది. భార్య ఐదో రోజు కార్యక్రమానికి హాజరయ్యేందుకు అత్తింటికి చేరుకున్న ఎస్సై ఉరి వేసుకుని చనిపోవడం కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

ఐదు రోజుల క్రితం…

ఐదు రోజుల క్రితం కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని హునుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న టూ టౌన్ ఎస్సై చంద్ర శేఖర్ భార్య దివ్య గన్నేరు పంపు దంచుకుని తిని ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న దివ్యను హైదరాబాద్ తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. దివ్య కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అయితే అదే రోజు సాయంత్రం జిల్లాలోని ఇల్లందకుంట సీతంపేటకు దివ్య మృత దేహాన్ని తరలించి అంత్యక్రియలు చేస్తున్నారు. సీతంపేటకు చేరుకున్న చంద్రశేఖర్ పై దివ్య బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్ర శేఖర్ కారణంగానే దివ్య ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపించడంతో ఆయనను ఓ గదిలో ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మికుంట సర్కిల్ పోలీసులు సీతంపేటకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చంద్ర శేఖర్ ను అక్కడి నుండి బయటకు తీసుకెళ్లడంతో అంతా సద్దుమణిగిందని అనుకున్నారు.

నేడు ఎస్సై

అయితే శనివారం చనిపోయిన దివ్య ఐదో రోజు కార్యక్రమం నిర్వహించేందుకు సీతంపేటకు చేరుకున్న ఎస్సై చంద్ర శేఖర్ అత్తవారింట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. భార్య ఆత్మహత్య చేసుకోవడానికి నీవే కారణమంటూ సీతంపేట వాసులు చంద్రశేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు భార్య మరణాన్ని తట్టుకోలేకపోయి ఉరివేసుకుని మరణించాడని స్థానికులు చెప్తున్నారు.

అనాథులుగా… 

తల్లిదండ్రుల క్షణికావేశం ఫలితం ఇద్దరు చిన్నారులు అనాథులుగా మిగిలిపోయారు. ఎస్సై చంద్రశేఖర్, దివ్య దంపతులకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. ఏడేళ్ల వయసు కూడా దాటని ఆ చిన్నారులిద్దరూ తల్లిదండ్రులు దూరం కావడం స్థానికులను కలిచివేసింది. మరణమంటే ఏమిటీ తెలియని చిరుప్రాయంలో వారిద్దరూ అమ్మానాన్నలను కోల్పోయిన తీరు స్థానికంగా విషాదాన్ని నింపింది. 

crimeflash newskarimnagar crimeLatest NewsTG NEWS
Comments (0)
Add Comment