క్యాంపు రాజకీయాలకు ‘‘శివయ్య’’ బ్రేక్…

ఉపవాస దీక్షకు ఇబ్బంది…

దిశ దశ, కరీంనగర్:

మునిసిపల్ ఎన్నికల క్యాంపు రాజకీయాలు కొనసాగేనా..? తమ పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు నాయకులకు ఇబ్బందికరంగా మారిందా..? కౌంటింగ్ అయిన వెంటనే శిబిరాలకు తరలించాలంటే శివయ్య ఆటంకంగా మారాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

13న కౌంటింగ్…

మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమ పట్టు నిలుపుకున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల అయితే అధికార పార్టీ నాయకులు తమ అభ్యర్థులను పోటీ నుండి తప్పించే అవకాశం ఉందని నామినేషన్ల పర్వం ముగియగానే విత్ డ్రా టైం గడిచే వరకూ క్యాంపులు నిర్వహించారు. పోలింగ్ కు ముందే పోటీ నుండి తమ పార్టీ అభ్యర్థులచే నామినేషన్ల ఉప సంహరణ చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని పార్టీల నాయకులు ఈ ఎత్తులు వేశారు. అయితే పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో కౌంటింగ్ పై దృష్టి పెట్టాయి రాజకీయ పార్టీలు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వెంటనే గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించాలన్న యోచనలో ఆయా రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పట్లు చేసే పనిలో కూడా నిమగ్నం అయ్యారు. గెలిచిన వారి వద్ద మొబైల్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి కుటుంబ సభ్యులచే తాము ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మాత్రమే మాట్లాడించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు క్యాంపులకు సంబంధించిన ఏర్పాట్లు, రూట్ మ్యాప్, వాహనాలను సిద్దం చేస్తున్నారు కూడా.

అదే ఇబ్బంది…

అయితే క్యాంపు రాజకీయాలకు ఈ సారి శివరాత్రి పర్వదినం ఆటంకంగా మారింది. ఈ నెల 16న మునిసిపల్ ప్రతినిధుల ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక ప్రక్రియ కూడా కొనసాగనుంది. 13న కౌంటింగ్ ముగిసిన తరువాత ప్రతినిధులను క్యాంపులకు తరలించాలంటే 15న శివరాత్రి పర్వదినం కావడంతో ఇబ్బందికరంగా మారింది. మహా శివరాత్రి సందర్భంగా చాలా మంది ఉపవాస దీక్షలు చేసి ఆ రాత్రి జాగాహరణ చేస్తుంటారు. తమ ఇండ్లలో శివ నామస్మరణ చేస్తూ సమీపంలోని శివాలయాలకు వెల్లి దర్శనాలు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. 16న ప్రమాణ స్వీకారం అయినందున 15నాటి శివరాత్రి పర్వదినాన్ని ఆచారం ప్రకారం జరుపుకునే వీలు ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది క్యాంపులకు వెల్లేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోతోందన్న చర్చ ఆయా రాజకీయ పార్టీల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను క్యాంపులకు తరలించడం ఎలా..? శివరాత్రి పర్వదినం రోజున కూడా శిబిరాల్లో ఉండే విధంగా వారిని మెప్పించడం ఎలా అన్న తర్జన భర్జనలు సాగుతున్నాయి.

ప్రత్యామ్నాయం…

అయితే శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలలో బస ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. క్యాంపుల నుండి నేరుగా శైవ ఆలయాలకు తీసుకెళ్లి మరునాటి ఉదయం నేరుగా సంబంధిత మునిసిపల్ కార్యాలయాల వద్దకు చేరే విధంగా రూట్ మ్యాప్ సిద్దం చేసే పనిలో ఉన్నట్టుగా సమాచారం. అయితే ఇందుకు ప్రజా ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తారా లేదా అన్న మీమాంస కూడా కొనసాగుతోంది. ఏది ఏమైన ఆయా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయనున్న మునిసిపల్ క్యాంపులకు శివరాత్రి పర్వదినం కొత్త చిక్కునే తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

2026 Municipal Electionsmaha shivaratrimuncipal electionsTelangana Politics
Comments (0)
Add Comment