కాంగ్రెస్ కురువృద్దుని ఆగ్రహం… క్యాడర్ కు గుర్తింపు లేదంటూ మండిపాటు…

మంత్రి అడ్లూరితో జగిత్యాల నేత జగడం…

దిశ దశ, జగిత్యాల:

నాలుగు దశాబ్దాలకు పైగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న ఆ నేత సొంత పార్టీ నేతల తీరుపై మండి పడుతున్నారు. వలస దారులను ప్రొత్సహిస్తూ అసలు సిసలైన పార్టీ శ్రేణులను విస్మరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగ రోజున మంత్రి ముందు అధిష్టానం తీరును ఏకిపారేశారు. పట్టదారులమైన తమను విస్మరించి కౌలు దారులను పెంచిపోషిస్తున్న తీరు సరికాదంటూ నిలదీశారు. జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టి స్తున్నాయి. మీరు మమ్మల్ని హలాల్ చేస్తున్నారు… దీనికన్నా ఒకే సారి జట్కా ఇవ్వాలని మంత్రి అడ్లూరితో జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇంటా బయటా సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

అసలేం జరిగింది..?

సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. అయితే ఇటీవల స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని డాక్టర్ సంజయ్ కుమార్ వివరణ ఇచ్చారు. అయితే వలస వాదులను ప్రొత్సహించడం ఎందుకు..? ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడం మంచిది కాదంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మొదటి నుండి బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. డాక్టర్ సంజయ్ కారణంగా మారిన సమీకరణాల నేపథ్యంలో అప్పట్లోనే జీవన్ రెడ్డి కినుక వహించారు. దీంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపడంతో సద్దుమణిగింది. ఆ తరువాత జరుగుతున్న పరిణామాలన్నింటిని పరిశీలిస్తున్న జీవన్ రెడ్డి ఆగ్రహాన్ని కట్టడి చేసుకోలేకపోయారు. దీంతో తన అనుచరులతో కలిసి మంత్రి అడ్లూరిని కలిసి ఆవేదనను వెలిబుచ్చారు. పార్టీతో అనుబంధం పెనేవేసుకున్న తమను విస్మరించి నిర్ణయాలు తీసుకుంటున్న తీరు ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ వారికి…

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి నామినేటెబ్ పదవులు కట్టబెట్టడం ఏంటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అనుచరుకుల నామినేటెడ్ పదవులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నైరాశ్యానికి గురి చేసిందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలంగా పార్టీలోనే కొనసాగుతున్న తనతో పాటు తన అనుచరులకు గుర్తింపు లేకుండా చేస్తున్నారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు సరికాదని, తనకు అనచరులకు మధ్య ఉన్న అనుభందాన్ని విడదీయలేరని, వారితో తనకున్న ఆత్మీయత అలాంటిదని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఓటమి…

ఓటమి చవి చూసిన అంశంపై కూడా మంత్రి అడ్లూరితో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మీరు కూడా ఓడిపోయిన గెలిచిన వారే కదా అని జీవన్ రెడ్డి మంత్రిని ఉద్దేశించి కామెంట్ చేశారు. జీవన్ రెడ్డి వరస ఓటమి పాలయ్యారన్న విషయాన్ని అధిష్టానం పెద్దలు పదే పదే అంటున్న విషయం ఆయన దృష్టికి వచ్చి ఉంటుందని ఈ వ్యాఖ్యను బట్టి స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తనలోని ఆవేదనను వ్యక్తం చేస్తున్న తీరు మాత్రం కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లోనూ ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత బాహాటంగా అసహానాన్ని ప్రదర్శించే పరిస్థితులు నెలకొనడం మంచింది కాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ADLURI LAXMAN KUMARcm revanth reddyCongressJAGITIAL NEWST JEEVAN REDDY