దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచులు మూసివేయాలని నిర్ణయించారు. పెండింగ్, రన్నింగ్ బిల్లుల రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరకపోయినందున రీచులను బుధవారం నుండి మూసి వేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ సాండ్ మైనింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకటన కూడా విడుదల చేసింది. బుధవారం నుండి ఇసుక తవ్వకాలను నిలిపివేస్తున్న నేపథ్యంలో ముందుగానే మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులకు సమాచారం ఇచ్చి ఆన్ లైన్ లో ఇసుక నిలువల వివరాలు అప్ లోడ్ చేయకూడదని కోరాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఇసుక రవాణా చేసే లారీ అసోసియేషన్ ప్రతినిధులకు కూడా ముందుగా సమాచారం ఇవ్వనున్నారు. ఈ నెల 6న ప్రిన్సిపల్ సెక్రటరీ, టీజీఎండీసీ ఎండీలను కలిసి పెండింగ్, రన్నింగ్ బిల్లులు వెంటనే ఇప్పించాలని అభ్యర్థించినప్పటికీ నేటికీ ఆచరణలో పెట్టలేదని అసోసియేషన్ వెల్లడించింది. వారం రోజుల సమయం ఇవ్వాలని టీజీఎండీసీ ఎండీ కోరగా ఇందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ సాండ్ మైనింగ్ కాంట్రాక్టర్లకు మాత్రం నిధులు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పెండింగ్ బిల్లులతో పాటు ప్రతి 15 రోజుకోసారి రన్నింగ్ బిల్లులు ఇస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం పెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్, రన్నింగ్ బిల్లులు చెల్లించే వరకూ రాష్ట్రంలోని అన్ని క్వారీల్లో ఇసుక సేకరణ నిలిపివేయాలని అసోసియేషన్ నిర్ణయించుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయిన తమ విషయాన్ని ప్రభుత్వం కూడా సానుకూల దృక్ఫథంతో పరిశీలించాల్సిన అవసరం ఉందని, అయితే తమకు రావల్సిన బిల్లుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.