CRIME: రెండో తాళం చెవి ఏమైంది..?

చెన్నూరు ఎస్బీఐలో అసలేం జరిగింది..?

దిశ దశ, చెన్నూరు:

నగదు లావాదేవీలు, విలువైన నగలను భద్ర పర్చుకునే బ్యాంకు అది… ఖాతాదారులకు అత్యంత నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత అక్కడ పనిచేసే ఉద్యోగులపై ఉంటుంది. కానీ అత్యంత భద్రంగా ఉండే లాకర్ లో ఉన్న నగదు, బంగారం అదృశ్యం కావడమే సంచలనంగా మారింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో రూ. 4 కోట్ల విలువ చేసే నగదు, బంగారం ఆభరణాలు మాయం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ పని చేస్తున్న బ్యాంక్ క్యాషీయర్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. గురువారం వెలుగులోకి వచ్చిన తరువాత రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నగదు, గోల్డ్ మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు చేపట్టామని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ప్రకటించారు.

కస్టోడియన్స్ ఎవరూ..?

చెన్నూరు బ్యాంకు లాకర్ గదిలొ భద్రపర్చిన నగదు, బంగారం అదృశ్యం మిస్టరీ వెనక ఇంటి దొంగల పనే అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. లాకర్ గదిలోకి ప్రైవేటు వ్యక్తులు వెల్లే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. సీసీ కెమెరాల నిఘాలో ఉండే బ్యాంకు నుండి రూ. 4 కోట్ల మేర గల్లంతు కావడంపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా బ్యాంకు లాకర్ గదులకు సంబంధించిన తాళం చేతులు ఇద్దరు కస్టోడియన్ల వద్ద ఉంటాయి. ఇద్దరు కలిసి రెండు తాళం చేతులతో లాక్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేస్తుంటారు. రోజూ సాయంత్రం బ్యాంకు మూసేసే సమయానికి లాకర్ గదిలో కస్టోడియన్లు ఇద్దరు కూడా నగదు, బంగారు నగలు లెక్క సరి చూసుకుని రిజిస్టర్ లో సంతకాలు చేసిన తరువాతే లాక్ చేస్తారని తెలుస్తోంది. కనీసం నెలకు ఒక సారి అయినా బ్యాంకు మేనేజర్ లాకర్ గదిలో ఉన్న నగదు, బంగారం ఎంత ఉంది..? రిజిస్టర్ లో ఉన్న వివరాలకు సరిపోలుతుందా లేదా అని చెక్ చేసుకోవల్సి ఉంటుందని సమాచారం. అయితే బ్యాంకు నుండి రూ. 4 కోట్ల మిస్ కావడం, తాను క్యాషీయర్ ను నమ్మి తాళం చేతులు అతనికే అప్పగించానని చెప్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. బ్రాంచ్ కార్యాలయానికి ఇంఛార్జిగా వ్యవహరించాల్సిన అధికారి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది అందునా లాకర్ గది భద్రత విషయంలో మేనేజర్ స్వీయ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కానీ చెన్నూరు SBI లాకర్ విషయంలో మాత్రం ఉదాసీన వైఖరి కనబర్చినట్టుగా బ్యాంకు మేనేజర్ వివరిస్తున్న తీరును బట్టి స్పష్టం అవుతోంది.

ఒకేసారా..?

నగదు, బంగారం లాకర్ గది నుండి ఒకేసారి తరలించారా లేక, విడుతల వారిగా తరలించారా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. లాకర్ గది నుండి వీలు చిక్కినప్పుడల్లా తీసుకెళ్లారా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది. లాకర్ గది నుండి ఒకేసారి నగదు, బంగారు తీసుకెళ్లినట్టియతే ఖచ్చితంగా గుర్తించే అవకాశం ఉంటుందని, సీసీ కెమెరాల కంట పడకుండా ఒకేసారి తీసుకెళ్లడం సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విడుతల వారిగా తీసుకెళ్లినట్టయితే లాకర్ లో ఉన్న వివరాలను సరి చూసుకునే విషయంలో కూడా బ్యాంకులో కీలకంగా వ్యవహరించే మేనేజర్ నిర్లక్ష్యం ప్రదర్శించారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. బ్యాంకు లాకర్ భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడం వెనక ఏమైనా మతలబు ఉందా అన్న విషయంపై కూడా పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. బ్యాంకు లాకర్ గదిలో అదృశ్యం అయిన నగదు, బంగారం విలువ రూ. 4 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారంటే ఇక్కడ లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని స్పష్టం అవుతోంది. భారీగా లావాదేవీలు జరుగుతున్న బ్రాంచ్ భద్రత విషయంలో అదే స్థాయిలో చర్యలు చేపట్టవలసి ఉంటుంది. కానీ చెన్నూరు బ్యాంకు లాకర్ నుండే నగదు, బంగారం ఎత్తుకెళ్లిన తరువాత వెలుగులోకి రావడాన్ని గమనిస్తే డొల్లతనం బయటపడుతోంది.

సెక్యూరిటీ అలెర్ట్..?

బ్యాంకుల వద్ద సదరు సంస్థలు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునే విధానం కూడా అమల్లో ఉంది. సెక్యూరిటీ సిబ్బంది బ్యాంకు లాకర్ గది విషయంలోనూ ఓ కన్నెసీ ఉంచాల్సి ఉంటుంది. నగదు తీసుకొచ్చినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది లాకర్ గది వరకు వెల్లి బందోబస్తు చేపడుతుంటారు. అలాగే బ్యాంకులోకి విధులు చేపట్టేందుకు వచ్చి వెల్లే ఉద్యోగులను తనిఖీలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. చెన్నూరు బ్యాంకులో గల్లంతయిన నగదు, బంగారం విషయంలో ఇంటి దొంగల ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ అప్రమత్తతపై  అనుమానాలు వస్తున్నాయి.

గత అనుభవాలూ…

గతంలో కూడా బ్యాంకుల లాకర్ల నుండి డబ్బులు, నగదు ఎత్తుకెళ్లిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు లాకర్ నుండి బంగారం అదృశ్యం కావడం సంచలనంగా మారింది. అయితే గంటల వ్యవధిలోనే దానిని మహదేవపూర్ మండలం అంబట్ పల్లిలో దాచిపెట్టిన విషయాన్ని సదరు ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కథ సుఖాంతం అయింది. ఇలాంటి ఘటనలు ఇతర ప్రాంతాల్లో కూడా జరిగిన నేపథ్యంలో మేనేజర్లు పట్టించుకోని వైఖరి అవలంభించడం విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా రామగుండం కమిషనరేట్ పరిధిలోని గుంజపడుగా ఎస్బీఐ బ్యాంకులో దోపీడీ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నేషనల్ హైవే సమీపంలో ఉన్న వర్దన్నపేట బ్యాంకులోను రాబరీ జరిగింది. దోపీడీ ముఠాలు చొరబడకుండా ఉండేందుకు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. అలాగే బ్యాంకుల్లో జరుగుతున్న లావాదేవీలు, డిపాజిట్లు, గోల్డ్ లోన్స్ కు అనుగుణంగా బ్రాంచులను ఆధునీకరించడం, అందుకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టేందుకు రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెప్తున్నాయి, అందుకు అనుగుణంగా ఆయా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయా లేదా అన్న విషయంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

chennurCHENNUR NEWScrime newsSBItelangana news