కాళేశ్వరం వద్ద పెరుగుతున్న నీటి మట్టం…
దిశ దశ, మహదేవపూర్:
ఎగువ గోదావరి నదిలో వరద నీటి ఆనవాళ్లు కానరాకున్నా… దిగువ గోదావరికి మాత్రం జళకళ సంతరించుకోవడం విశేషం. సమృద్దిగా వర్షాలు కురవకపోవడంతో అన్నారం బ్యారేజీ వరకు కూడా వరద నీరు రావడం లేదు. అయితే ప్రాణహిత నది కలుస్తున్న తరువాత గోదావరి నదికి వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. మహారాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు పడుతుండడంతో భారీ ఎత్తున వరద నీరు గోదావరికి వచ్చి చేరుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3267 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే ఇన్ ఫ్లోగా ఉండగా, 20.175 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు. 8.7 టీఎంసీల నీరు మాత్రమే నీరు నిలువ ఉంది. దీంతో ఎగువ ప్రాంతం నుండి వస్తున్న నీటిని ఇక్కడే నిలువ ఉంచుతున్నారు. ఎగువ ప్రాంతమైన శ్రీరాంసాగర్, కడెం నారాయణరెడ్డిలకు భారీ ఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్టయితే శ్రీపాద ఎల్లంపల్లి నుండి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉంటుంది. ఎల్లంపల్లికి దిగువన ఉన్న సుందిళ్ల బ్యారేజీకి 500 క్యూసెక్కుల నీరు మాత్రమే ఇన్ ఫ్లో వస్తోంది. అన్నారం బ్యారేజీకి కూడా నామమాత్రంగానే వరద నీరు వస్తున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది కలిసిన తరువాత గోదావరి నది స్వరూపమే మారిపోయింది. వరద ఉధృతితో కాళేశ్వరం వద్ద క్రమ క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రాణహిత నది నుండి 7 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి వరద భారీగా పెరిగిపోయింది. ఈ నెల 2వ తేదిన మేడిగడ్డ వద్ద 36 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో రికార్డు కాగా, మరునాటికి 71 వేల క్యూసెక్కులకు చేరింది. 4వ తేది 84 వేల క్యసెక్కుల నీటి ప్రవాహం కొనసాగగా, ఆ తరువాత వరద ఉధృతి కొంతమేర తగ్గినట్టే కనిపించింది. 6వ తేది నాటికి 54 వేల క్యూసెక్కులకు చేరడంతో గోదావరి నది తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఈ నెల 7న 71 క్యూసెక్కులు, 8న లక్షా 33 క్యూసెక్కులకు పెరిగింది. 9వ తేది సాయంత్రం 2.41 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాణహిత నది నుండి గోదావరినదికి వరద నీరు రాగా, గురువారం ఉదయం నాటికి ఏకంగా 5 లక్షల 25 వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాణహిత నదికి ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరద ఉధృతి తీవ్రంగా వస్తున్నట్టుగా తెలుస్తోంది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే 7 లక్షల క్యూసెక్కుల మేర నీరు గోదావరి నదిలోకి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి దిగువన ఉన్న ఇంద్రావది నది కూడా వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని సమ్మక్క సారలక్క బ్యారేజీకి 8 లక్షల వరకు వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో భద్రాచలం వద్ద 40 ఫీట్ల మేర గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు.