దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాల పర్వం మొదలైంది. ఏండ్లుగా పార్టీతో అనుబంధం పెనవేసుకుని ముందుకు సాగుతున్న తమపై అధిష్టానం వివక్ష చూపిందని రాయికల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన తమను కాదని కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారికి టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సంమంజసమని స్థానిక నాయకులు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునితో పాటు అదే పార్టీకి చెందిన నాయకుల అభ్యర్థిత్వాలు ఖరారు చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తమకు గుణపాఠం చెప్పిందని వ్యాఖ్యానించిన నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు.
రాజీనామా…
రాయికల్ పట్టణ యువజన అధ్యక్షుడు నాగరాజు, మహిళా అధ్యక్షురాలు తాటిపాముల మమతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తమ అభ్యర్థిత్వాలు ఖరారు చేయకుండా బీఆర్ఎస్ వారిని అందలం ఎక్కించిన తీరు సరికాదన్నారు. పార్టీ పట్ల తమకు ఉన్న నిబద్దతను, నిఖార్సైన శ్రేణులకు అన్యాయం చేసే విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. గెలిచే అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ కండువా కూడా వేసుకోని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు టికెట్లు ఇవ్వడంపై ఏంటని వారు ప్రశ్నించారు.
పోటీ నుండి…
మరో వైపున రాయికల్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేష్ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నానని ప్రకటించారు. తనకు పార్టీ అవకాశం ఇచ్చిన 2వ వార్డు నుండి పోటీ చేయడం లేదని ప్రకటించారు. తనను నమ్ముకున్న నాయకులకు టికెట్లు కెటాయించలేదని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. తనతో పాటు ఇంతకాలం కలిసి నడిచిన నాయకుల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చించి తాను కూడా నిర్ణయం తీసుకుంటానని రమేష్ ప్రకటించారు.