Kaleshwaram: చిన్న కాళేశ్వరంతో చింత…

సమస్య పరిష్కారం చూపండి

మంత్రి ‘దుద్దిళ్ల’కు రైతుల వినతి

దిశ దశ, మహదేవపూర్:

మహదేవపూర్ ప్రాంతంలో నిర్మిస్తున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రైతులతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన మహదేవపూర్ ఏరియాలో 60 ఫీట్ల లోపునే బోర్లలో నీరు సమృద్ధిగా పడతాయని రైతులు మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా సాగు చేస్తున్నామని తెలిపారు. మెజారిటీ రైతులు డ్రిప్ ఇరిగేషన్ విధానంలో సాగు చేస్తున్నారన్నారు. వాణిజ్య పంట అయిన మిర్చి ఎక్కువగా పండించే ఈ ప్రాంతంలో బిందు సేద్యం వల్ల దిగుబడి కూడా విపరీతంగా పెరిగిందని వెల్లడించారు. దీనివల్ల కలుపు మొక్కలు పెరిగే అవకాశం లేకుండా పోయిందని, గోదావరి నది పరివాహక ప్రాంతం కావడం వల్ల తమకు ఏనాడూ నీటి కొరత ఏర్పడలేదని రైతులు మంత్రికి తెలిపారు. కమర్షియల్ క్రాప్ అయిన మిర్చి పంటకు కెనాల్స్ ద్వారా నీటిని అందించినట్టయితే చేలల్లో కలుపు మొక్కలు తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉందని, వాటిని నిర్మూలించేందుకు రైతులు అదనంగా ఖర్చులు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపారు. కలుపు మొక్కలను అలాగే వదిలేస్తే మిర్చి పంట ఏపుగా ఎదగదని, ఈ ప్రభావం దిగుబడిపై పడుతుందన్నారు. కాలువల కోసం భూ సేకరణ బాధిత రైతులు తక్కువే ఉన్నప్పటికీ వీటి ద్వారా నీటిని సరఫరా చేయడం వల్ల పడే భారం ఎక్కువగా ఉంటుందని మహదేవపూర్ రైతులు మంత్రికి వివరించారు. ఏటా రూ. 300 కోట్ల విలువైన మిర్చి పంట ఒక్క మహదేవపూర్ ప్రాంతంలో సాగవుతోందని తెలిపారు. దాదాపు 8 నెలల పాటు వ్యవసాయం కారణంగా ఉపాధి పొందుతున్న కూలీలు, పరోక్షంగా ఆదాయం అర్జిస్తున్న వారంతా కూడా ఆర్థికంగా నష్ట పోతారని వివరించారు.

మంత్రి ఆదేశం…

మహదేవపూర్ రైతుల తెలిపిన వివరాలు విన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. రైతులకు ఎదురవుతున్ప ఈ సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహదేవపూర్ రైతులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని స్థానిక సింగిల్ విండో ఛైర్మన్ తిరుపతి రెడ్డిని ఆదేశించారు. రైతాంగానికి ఎదురయ్యే సమస్యలను వివరంగా రాసి తీర్మానం చేసి పంపించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.

 

chinna kaleshwarmDUDDILLA SRIDHAR BABUkaleshwaramLatest Newsmahadevpur