ప్రధాని పర్యటనతో నూతనోత్తేజం… మోడి కితాబుతో మరింత జోష్…

దిశ దశ, వేములవాడ:

వేములవాడ సభ సక్సెస్ తో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపినట్టయింది. దూకుడు మీద ఉన్న బీజేపీ నాయకులకు ప్రధాని టూర్ మరింత జోష్ నింపినట్టయింది. కరీంనగర్ లోకసభ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడి పర్యటించారు. ఉదయమే బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో జన సమీకరణ సాధ్యమవుతుందా లేదా అన్న మీమాంసలకు చెక్ పెట్టేసినట్టయింది. ప్రధాని వేములవాడ చేరుకునే సరికే సభా ప్రాంగణమంతా కూడా నిండిపోవడంతో బీజేపీ నాయకుల అంచనాలు సఫలం అయ్యాయి.

మీమాంసలో…

మద్యాహ్నం తరువాత నిర్వహించే బహిరంగ సభలకు జనసమీకరణ సాధ్యమవుతుంది. అయితే స్థానిక బీజేపీ నాయకులు కాస్తా భిన్నంగా ఆలోచించి ఉదయం వేములవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలింగ్ సమీపిస్తుండడంతో ప్రధానమంత్రి మోడీ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో బీజేపీ ఉదయం పూట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ధైర్యం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి జనం సభా వేదిక వద్దకు చేరుకోవడం అసాధ్యమే అయినా అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రణాళికలు తయారు చేసుకున్నారు. అయినప్పటికీ సభ సక్సెస్ అవుతుందా… 10 గంటల వరకు జనం సభాస్థలికి చేరుకుంటారా అన్న అనుమానం వెంటాడింది. మరో వైపున మంగళవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కూడా రావడంతో పార్టీ శ్రేణులు మరింత ఆందోళన చెందాయి. మంగళవారం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇతర నాయకుల కార్యక్రమాలు కూడా అసంపూర్తిగా జరగడంతో బీజేపీ నాయకులు అప్రమత్తం అయ్యారు. ఎంపీ బండి సంజయ్ వేములవాడ చేరుకుని బహిరంగ సభా వేదికవద్ద పకడ్భందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.

నేనే ఫెయిల్ అవుతా…

వేములవాడ సభకు హజరైన ప్రధాని మోడీ ప్రాంగణాన్ని పరిశీలించి స్థానిక నేతలకు కితాబిచ్చారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తానే స్వయంగా సభ ఏర్పాటు చేసినా ఇంత ఉదయం ఈ స్థాయిలో జనసమీకరణ సాధ్యం అయ్యేది కాదని వ్యాఖ్యానించడంతో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకుల్లో నయాజోష్ నింపినట్టయింది. ఇప్పటికే ఏడు సెగ్మెంట్లలో ప్రచార పర్వాన్ని పూర్తి చేసుకున్న బీజేపీ నాయకులు గెలుపు ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ అభింనందనలతో మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి.

2024 Electionsbandi sanjaybandi sanjay kumarBJP TELANGANAloksabha elections