అర్చకుల ఆందోళన..
దిశ దశ, జగిత్యాల:
ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలంగాణాలోరి ఓ ఆలయంలో రసాభసా చోటు చేసుకుంది. లోకేష్ బర్త్ డే పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరుపుతుండగా ఆలయ ఈవో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రాంగణంలో నిరసనల మొదలయ్యాయి.
అర్చకుల నిరసన…
ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, లోకేష్ అభిమానులు కొంతమంది శుక్రవారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకున్నారు. స్థానిక నాయకుల ద్వారా ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చిన నాయకులు అంజన్న ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆలయంలోకి వచ్చిన ఈఓ అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేశారని అర్చకులు ఆరోపించారు. అంతమంది ప్రధాన ఆలయంలో ఉండడం ఏంటని ప్రశ్నించారని, సస్పెండ్ చేస్తానని ఈఓ హెచ్చరించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అర్చకులు రాజగోపురం ముందు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్ది సేపు అంజన్న ఆలయంలో పూజలు నిలిచిపోయాయి. తమను అకారణంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆలయ ఉద్యోగులు పంపించనట్టయితే తాము ప్రత్యేక పూజలు జరిపే వారం కాదు కదా అని అర్చకులు అంటున్నారు. ఆలయంలో టీటీడీ నిధులతో వసతి సముదాయం నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించినప్పుడు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పూజలు నిర్వహించడం సరికాదని ఈఓ అనడం ఎంతవరకు సమంజసమని అర్చకులు ప్రశ్నించారు.
ఎమ్మెల్యే చొరవ…
కొండగట్టు అంజన్న ఆలయంలో అర్చకులు ఆందోళన చేపట్టారన్న సమాచారం అందుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థానిక నాయకులను పంపించి ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే అర్చకులతో మాట్లాడి విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు ఆలయ ఈఓతో కూడా చర్చించినప్పటికీ సానుకూలత వ్యక్తం కానట్టుగా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అర్చకులతో ఫోన్ లో మాట్లాడి ఆందోళన విరమించాలని పరిస్థితి చక్కదిద్దేందుకు తాను చొరవ తీసుకుంటానని మాట ఇచ్చారు. ఏది ఏమైనా కొండగట్టు అంజన్న ఆలయంలో చోటు చేసుకున్న ఈ పరిణామం సరికొత్త చర్చకు దారి తీసింది.