వేర్వేరు క్యాంపుల్లో ఒకే పార్టీ కౌన్సిలర్లు… జగిత్యాలలో వైవిద్యమైన రాజకీయాలు

అధిష్టానానికి సరికొత్త సవాల్…

దిశ దశ, జగిత్యాల:

మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాలలో వైవిద్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వేర్వేరు క్యాంపులకు తరలి వెళ్లడమే అసలు సమస్యగా మారింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్న రీతిలోనే పోటీ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రకటించిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. అయితే మొదటి నుండి పార్టీ జెండా మోసిన వాళ్లను కాదని బీఆర్ఎస్ వారికి టికెట్లు ఎలా కెటాయించారని జీవన్ రెడ్డి ప్రశ్నిస్తూ వచ్చారు. నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత జీవన్ రెడ్డి ఇండిపెండెంట్లకు, తన అనచరులకు మద్దతుగా నిలిచారు. ఫలితాలు వెలువడిన తరువాత ఇక్కడ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన వారిలో 14 మంది, స్వతంత్రులు ముగ్గురు సంజయ్ వర్గానికి చెందిన వారు కాగా, పార్టీ గుర్తుపై గెలిచిన వారిలో 9 మంది, స్వతంత్రులు 9 మంది జీవన్ రెడ్డి అనచరులు కావడం విశేషం. దీంతో సంజయ్ తన అండదండలతో గెలిచిన 17 మంది కౌన్సిలర్లను ఫలితాలు వెలువడిన కొద్దిసేపట్లోనే క్యాంపునకు తరలించారు. అయితే శనివారం సాయంత్రం జీవన్ రెడ్డి కూడా తన వర్గానికి చెందిన 18 మంది కౌన్సిలర్లను శిబిరానికి తరలించారు. దీంతో జగిత్యాల మునిసిపల్ రాజకీయాలు రంజుగా మారిపోయాయి. ప్రత్యర్థి పార్టీల నాయకులు తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు క్యాంపులు ఏర్పాటు చేసే సాంప్రాదాయం ఉంటుంది కానీ జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే వేర్వేరు శిబిరాలకు తరలి వెళ్లడం మాత్రం జగిత్యాలలో జరుగుతోంది. ఈ మునిసిపాలిటీలో బీజేపీ అభ్యర్థులు ఆరుగురు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నలుగురు ఎంఐఎం నుండి ఇద్దరు, బీజేపీ రెబెల్స్ ముగ్గురు గెలిచారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు నామ మాత్రపు సీట్లను సాధించడంతో పోటీ వాతావరణం లేకుండా పోయింది. కానీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గాలే కాంగ్రెస్, స్వతంత్రులతో క్యాంపులు నిర్వహిస్తుండడం గమనార్హం.

ఆయనిలా… ఈయన అలా…

అయితే 50 వార్డులు ఉన్న జగిత్యాల మునిసిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 26 మంది కౌన్సిలర్లు అవసరం ఉంటుంది. కానీ సంజయ్ వర్గానికి చెందిన వారు 17 మంది, జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వారు 18 మంది గెలిచారు. దీంతో ఈ ఇద్దరు నాయకులు తమ వారికే ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టాలన్న పంథంతో పావులు కదుపుతున్నారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం తాను పార్టీ లైన్ దాటేది లేదని, మొదటి నుండి పార్టీ జెండా మోసిన వారినే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లుగా ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు షరతు విధించారు. మీడియా సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రకటించిన జీవన్ రెడ్డి అదిష్టానాన్ని ఇరకాటంలో పెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున డాక్టర్ సంజయ్ కుమార్ తన బలాన్ని పెంచుకునేందుకు పావులు కదపడం మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రెబెల్స్ అభ్యర్థులతో మంతనాలు జరిపిన ఆయన తనకు మద్దుతు ఇచ్చేందుకు ఒప్పించినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ సంజయ్ వర్గానికి కౌన్సిల్ లో బలం 20 మాత్రమే అవుతోంది తప్ప మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోవడం లేదు. మరో ఆరుగురు కౌన్సిలర్లు సంజయ్ వర్గంలో చేరితో తప్ప ఆయన లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సంజయ్ కి మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురిని కూడా తనకు అనుకూలంగా మల్చుకుని పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు కాకుండా జాగ్రత్త పడినప్పటికీ ఈ సంఖ్య 24కు చేరుతోంది. ఎంఐఎం అనుకూలత ప్రదర్శిస్తే తప్ప ఆయన అనుచరులు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ స్థానాలను దక్కించుకునే అవకాశం అయితే లేదు. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఈ సమీకరణాలకు దూరంగా ఉంటూనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ జెండా మోసిన వారికి అవకాశం ఇస్తే తాను మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నానని ప్రకటించారు. దీంతో అధిష్టానం వీరిద్దరిని ఎలా సముదాయిస్తుంది..? జగిత్యాల పీఠాన్ని ఎలా కైవసం చేసుకుంటుందన్నదే పజిల్ గా మారింది.

ఆ హక్కు..?

ఇకపోతే జగిత్యాల మునిసిపల్ ఎన్నికల్లో ఎక్స్ ఆఫిషియో ఓటు హక్కును కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సంజయ్ తన ఓటు హక్కును వినియోగించే అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ విప్ జారీ చేస్తే అందుకు అనుగుణంగా నడుచుకుంటానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన కౌన్సిలర్లకు అండగా నిలిచినట్టయితే బీఆర్ఎస్ పార్టీ దీనినే సాక్ష్యంగా చూపించి మరోసారి స్పీకర్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణంగా డాక్టర్ సంజయ్ అధికారికంగా మద్దుతు ఇవ్వడం మాత్రం అసాధ్యమన్న వాదనలే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ఎల్ రమణ జగిత్యాల ఓటరే కాబట్టి ఆయన ఇక్కడి మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. కానీ పార్టీకి అంతగా బలం లేకపోవడంతో ఆయన దూరంగా ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంజయ్ వర్గానికి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నట్టయితే సోమవారం నాడు జరగనున్న కౌన్సిల్ సమావేశానికి జీవన్ రెడ్డి వర్గం దూరంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కోరం లేకపోవడంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆయన కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ల సహకారంతో ఆయన వర్గానికే పదవులు దక్కేవిధంగా పావులు కదిపినట్టయితే కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడని రీతిలో నడుచుకుని తన పంథాన్ని నెగ్గించుకుంటారేమోనన్న చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది. ఏది ఏమైనా జగిత్యాల జగడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొదట్లోనే చెక్ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

2026 Municipal ElectionsJAGITIAL NEWSjgl newsmuncipal electionsT JEEVAN REDDY
Comments (0)
Add Comment