దారి తప్పి వచ్చిందా… ఈ దారినే ఎంచుకున్నారా..?

బోధన్ ప్రాంతంలో పందెం పావురం

దిశ దశ, నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పావురం ప్రత్యక్ష్యం అయింది. దాని కాలికి జియో ట్యాగ్ అమర్చి ఉండడం సంచలనంగా మారింది. అసలీ పావురం ఎక్కడిది..? ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చింది అన్నదే అంతుచిక్కక స్థానికులు మల్లగుల్లాలు పడ్డారు. జియో కోడ్ ట్యాగ్ చేసి ఉండడంతో గుడాఛార్యం కోసం పంపించిన పావురమేమోనని స్థానికులు భావించారు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు అటవీ ప్రాంతంలో గద్ద ప్రత్యక్ష్యమైంది. దానికి జియో ట్రాకర్ ఏర్పాటు చేశారని, కెమెరా కూడా అమర్చారని స్థానికంగా ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆ గద్ద కథ ఏమైంది అన్న విషయం మాత్రం తెలియ రాలేదు. తాజాగా బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానిపేటలో జియో ట్యాగ్ చేసి ఉన్న పావురం ప్రత్యక్ష్యం కావడంతో గుడచార్యం కోసం దీనిని పంపించి ఉంటారని  అనుమానించారు స్థానికులు. కానీ పోలీసులు మాత్రం అది పందెం పావురమని తేల్చి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

దారి తప్పిందా..?

అయితే మంగళవారం బోధన్ సమీపంలోని భవానిపేటలో దొరికిన పావురం ఈ ప్రాంతంలో సంచరించడానికి కారణమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. బోధన్ పరిసర ప్రాంతాల్లో కానీ పొరుగునే ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కానీ పావురాలతో పందాలు నిర్వహిస్తున్నారేమోనన్న చర్చ సాగుతోంది. రాయలసీమలోని సత్యసాయి జిల్లా గోరట్ల నుండి వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతానికి గత జనవరి నెలలో దాదాపు 300 పావురాలను తరలించారు బెట్టింగ్ వాలాలు. జియో ట్యాగ్ చేసి ఉన్న ఈ పావురాలు గోరట్లకు చేరుకునే విధంగా ప్లాన్ చేసుకుని వీటిని పరిగికి తరలించారు. 100, 200, 300 కిలో మీటర్ల మేర రేస్ నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తారని, ఇందులో భాగంగానే గోరట్లకు 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న పరిగికి తరలించి ఇక్కడి నుండి పావురాలను వదిలేసేందుకు వారు అక్కడకు చేరుకున్నారని పోలీసులు విచారణలో తేలింది. ప్రత్యేకంగా వాహనాల్లో తరలించిన పావురాల్లో కొన్నింటిని వదిలేయగా మిగతా వాటిని, తరలించిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. అయితే తాజాగా మంగళవారం నిజామాబాద్ జిల్లా భవానిపేటలో లభ్యమైన పావురానికి కూడా జియో ట్యాగ్ చేసి ఉండడంతో ఇది కూడా రేస్ కోసం ఉపయోగించిన పావురమేనని నిర్దారించినట్టుగా తెలుస్తోంది. దీంతో బోధన్ ప్రాంతంలో కూడా పావురాల పందాలు కొనసాగుతున్నాయా అన్న అనుమానం రేకెత్తుతోంది. ఈ ప్రాంతం మీదుగా పావురాల రేస్ నిర్వహిస్తున్న క్రమంలో అది దారి తప్పి భవానిపేటకు చేరుకుందా లేక సమీప ప్రాంతంలోనే పావురాల బెట్టింగ్ కొనసాగిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో పావురాల రేస్ నిర్వహిస్తున్న క్రమంలో గాడి తప్పిన పావురం భవానిపేటకు చేరుకుని ఉంటుందేమోనన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది.

గాలిలో అయితే బెటర్…

బెట్టింగ్ విషయంలో పోలీసులు చట్టాలకు పని చేప్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో గాలిలో పావురాల పోటీలు నిర్వహిస్తే అవి దొరికినా నిర్వాహాకులు, బెట్టింగ్ లో పాల్గొనే వారి గురించి మాత్రం పోలీసులకు చిక్కే అవకాశం ఉండదన్న ధీమాతో ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. విహాంగంలో పక్షులు ఎగురుకుంటూ వెల్తుండడం సహజంగానే జరుగుతుంటుంది. గుంపు గుంపులుగా పక్షులు ఎగురుకుంటూ ప్రయాణించి తమ గమ్యానికి చేరుకుంటుంటాయి. ఇదే విధంగా పావురాలచే పోటీ నిర్వహిస్తే ఎవరికీ అనుమానం వచ్చే అవకాశం లేదన్న ధీమాతోనే నిర్వాహకులు వీటిచే రేస్ చేపట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

Bodanflash newsNIZAMABAD NEWSPigeon bettingtelangana news