Phone Tapping case: రివ్యూ కమిటీ రివ్యూ చేయకపోవడం వెనక…?

ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగింది…

దిశ దశ, హైదరాబాద్:

వందల సంఖ్యలో వచ్చిన ఫోన్ నంబర్ల జాబితాకు కవరింగ్ లెటర్ జత చేసి రివ్యూ కమిటీ సభ్యులకు పంపగానే వాటిని ఠక్కున ఎలా ఆమోదించారు..? కమిటీలో ఇంటలీజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉన్నప్పటికీ మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణం చూపించి SIB పంపించిన జాబితాను వారు ఎలా ఆమోదించారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. రిటైర్డ్ అదికారి చేతుల్లో ఉన్న స్పెషల్ ఇంటలీజెన్స్ విభాగంలో అసలేం జరుగుతోందన్న అనుమానం రివ్యూ కమిటీ సభ్యులకు ఎందుకు రాలేదు..? అసలు మావోయిస్టుల ఉనికే లేనప్పుడు వందల సంఖ్యలో కాంటాక్టు నంబర్లు ట్యాపింగ్ చేయడం వెనక ఉన్న కారణం ఏంటీ అన్న విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు..? ఇప్పుడిదే చర్చ అటు హోంశాఖ వర్గాల్లో ఇటు పోలీసు విభాగంలో పెద్ద ఎత్తున సాగుతోంది.

నిఘా కళ్లు కప్పారా..?

SIB చీఫ్ గా వ్యవహరించిన రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు నేతృత్వంలో సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అప్పటి అధికారులు ఎందుకు అంత సీరియస్ గా దృష్టి సారించలేకపోయారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. తెలంగాణాలో అసలు మావోయిస్టుల ఉనికే లేనప్పుడు ఈ స్థాయిలో సానుభూతిపరులు ఉంటారా అన్న అనుమానం రివ్యూ కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తున్న వారికి ఎందుకు రాలేదన్నదే మిస్టరీగా మారింది. కవరింగ్ లెటర్ చూసి ఆమోదించామని ట్యాపింగ్ చేయాల్సిన నంబర్లు చాలా ఉండడంతో వాటిని పరివీలించ లేకపోయామని అప్పటి పోలీసు ఉన్నతాధికారులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాతో పంపిన కవరింగ్ లెటర్ లో మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణం చూపారని కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక్కడే అప్పటి ఉన్నతాధికారులు అసలు లాజిక్ మిస్సయినట్టుగా స్పష్టం అవుతోంది. కవరింగ్ లెటర్ లో మావోయిస్టులు అనే అంశం చేర్చినప్పుడు అసలు నక్సల్స్ ఉనికే లేనప్పుడు ఈ స్థాయిలో వారికి సహకరించే వారు ఉంటారా అన్న అనుమానం రివ్యూ కమిటీ ప్రతినిధులకు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? రాజకీయ సమీకరణాలు ఏంటీ..? ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటీ అన్న ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించే బాధ్యత ఇంటలీజెన్స్ విభాగంపై ఉంటుంది. ఈ విభాగంలో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు తమ ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితులను వివరిస్తుంటారు. వీటన్నింటిని క్రోడీకరించుకుని ఇంటలీజెన్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి కాన్ఫిడెన్షియల్ సమాచారం అందిస్తుంటారు. ఇంటలీజెన్స్ చీఫ్ ఆఫీసర్లుగా వ్యవహరించిన వారికి గత ఎన్నికలకు ముందు మావోయిస్టుల ఉనికిపై ఏమైనా నివేదికలు అందాయా..? అందకున్నా SIB ఇచ్చిన నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయంపై కూడా స్టేట్ ఇంటలీజెన్స్ డేగ కళ్లతో నిఘా వేస్తూనే ఉంటుంది. ఇందులో మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించిన విషయం కూడా పక్కాగా ఉంటుంది. గత కొంతకాలంగా మావోయిస్టుల కార్యకలాపాలే జరగడం లేదని అప్పటి పోలీసు అధికారులు ఘంటాపథంగా ప్రకటించారు. ఒక్క సరిహద్దు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టులను కట్టడి చేయాల్సి ఉందని తరుచూ ఆ ప్రాంతంలోనే రివ్యూ సమావేశాలూ ఏర్పాటు చేశారు. కానీ SIB ద్వారా మాత్రం వందలాది మంది ఫోన్లు ట్యాపింగ్ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు అప్పటి రివ్యూ కమిటీకి ఎందుకు అనుమానం రాలేదన్నదే పజిల్ గా మారింది. హోంశాఖ కార్యదర్శి ద్వారా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర పోలీసు వ్యవస్థకు సంబంధించిన ఫైళ్లన్ని కూడా హోంశాఖ కార్యాలయం నుండే మూవ్ అవుతుంటాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు సంబంధించిన అంశాలేవి రివ్యూ కమిటీ ప్రతినిధుల దృష్టికి రానప్పుడు ఉన్నట్టుండి ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వారు ఎలా పుట్టుకొచ్చారోనన్న అనుమానం వారికి రాకపోవడం విచిత్రంగా ఉంది. SIB కార్యాలయం నుండి వచ్చిన లేఖలకు చకాచకా ఆమోద ముద్ర వేయకుండా ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉప ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అదే నిజమైతే ప్రతి ఎన్నికల సమయంలో మాత్రమే మావోయిస్టుల బూచి చూపించడానికి కారణం ఏంటన్న అనుమానంతో క్రాస్ చెక్ చేయకపోవడం విస్మయం కల్గిస్తోంది. సాదారణంగా వచ్చే ఫైళ్లను అప్రూవ్ చేయడం వేరు కానీ శాంతిభద్రతల సమస్యతో ముడిపడి ఉన్న మావోయిస్టు అంశం కాబట్టి ఉన్నతాధికారులు కూడా అప్పటికప్పుడు సమీక్షించాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆయన అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిపైనే ఆరోపణలు చేయడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. SIBలోని సాంకేతికతను అందిపుచ్చుకుని ఇలాంటి తప్పిదాలకు పాల్పడ్డారా అన్న విషయంపై కూడా తర్జనభర్జనలు సాగుతున్నాయి.

బదిలీలు…

SIBలో విధులు నిర్వర్తించాలంటే గతంలో నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసిన అధికారులకే ప్రాధాన్యత ఇచ్చే సాంప్రాదాయం కొనసాగింది. నక్సల్స్ గ్రూపులపై సమగ్ర అవగాహన ఉండడంతో పాటు వారి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇచ్చే ఆనవాయితీ కొనసాగేది. అయితే ఇటీవల కాలంలో నక్సలిజం అంటేనే తెలియని అదికారులకు ఈ విభాగంలో పోస్టింగులు వేయడం కూడా వివాదస్పదంగా అవుతోంది. గ్రౌండ్ లెవల్లో పని చేసిన అధికారులను కాదని ఇతరులకు SIBలో పోస్టింగ్ ఇవ్వడం వల్ల ప్రాణాలకు తెగించి పనిచేసిన వారికి పదోన్నతులు రాకపోవడం, రివార్డులు అందకపోవడం వల్ల కూడా రాష్ట్రంలోని పోలీసు అధికారుల్లో నైరాశ్యం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో SIBలో ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయడంతో పాటు నక్సల్స్ కార్యకలాపాలతో సంబందం లేని అధికారులను బదిలీ చేయించుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్న విషయంపై దృష్టి సారించకపోవడం వల్ల కూడా ఇప్పుడు రాష్ట్ర పోలీసు వ్యవస్థ అబాసుపాలు కావల్సి వస్తోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రభాకర్ రావు కేంద్రీకృతంగానే సాగిన పోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రణీత్ రావు లాంటి యంగ్ ఆఫీసర్లు కూడా బలి కావల్సి వచ్చిందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. SIBలో జరుగుతున్న పరిణామాలపై అప్పటి ఉన్నతాధికారులు ఎందుకు నజర్ వేయలేకపోయారు..? వాటిని కట్టడి చేసే పరిస్థితులు లేకుండా పోవడానికి కారణం ఏంటీ అన్న కోణంలో ఆరా తీయాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

dsp praneeth raoIG PRABHAKAR RAOPHONE TAPPING CASEpranith rao dsptelangana news