RFCL: ఆర్ఫీసీఎల్ లో యూరియా ఉత్పత్తికి మరిన్ని రోజులు…

దిశ దశ, రామగుండం:

కీలకమైన సమయంలో మోరాయించిన రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీ లిమిటెడ్ (RFCL)లో యూరియా ఉత్పత్తి ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ నెల 22 లేదా 23 వరకు యూరియా ఉత్పత్తి అవుతుందనుకుని అధికారులు అంచనా వేసినప్పటికీ సాంకేతిక సమస్య అధిగమించకపోవడం వల్ల మరో వారం పది రోజుల పాటు వేచి చూడాల్సిందేనని తెలుస్తోంది. అమ్మోనియా వైడ్ లైన్ లో ఏర్పడిన లీకేజీ కారణంగా ఈనెల 14న యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఆర్పీసీఎల్ లో ఉత్పత్తిని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే పనిలో కేంద్ర ఎరువులు రసాయనాల విభాగం ప్రత్యేక దృష్టి సారించింది.

డెన్మార్క్ టెక్నాలజీ…

రామగుండం ఎరువుల కర్మాగారంలో డెన్మార్క్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. హాల్దర్స్ టాప్స్ కంపెనీ సహకారంతో ఆర్ఎఫ్సీఎల్ ను పునరుద్దరించారు. అయితే తరుచూ అమ్మోనియం ప్లాంట్ పైప్ లైన్లలో తరుచూ అవాంతరాలు ఎదురవుతుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది సాంకేతిక సమస్యల తీవ్రం కావడంతో ఎప్పటికప్పుడు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోంది. అసలే ఖరీఫ్ సీజన్ కావడం… యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కీలకమైన సమయంలో పరిశ్రమలో టెక్నికల్ ప్రాబ్లెమ్స్ ఎదురు అవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. High Temperature Reformer (HTR)లో ఏర్పడిన టెక్నికల్ ఇష్యూను పరిష్కరించాల్సిన అవసరం ఉందని సమాచారం. బుధవారం ఆర్ఫీసీఎల్ సీఎండీ శర్వానంద్ రామగుండం చేరుకుని పరిశ్రమలో ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. రెండు నెలల క్రితం చేపట్టిన వార్షిక మరమ్మత్తుల సమయంలో HTRను బైపాస్ చేసి ఉత్పత్తి చేపట్టడంతో తీవ్రమైన ఒత్తిడి కారణంగా అమ్మోనియా పైప్ లైన్ లీకేజ్ అవుతోందని తెలిసింది. డెన్మార్క్ కంపెనీ ప్రతినిధులు, చెన్నై, ముంబాయిల నుండి నిపుణులు కూడా వచ్చి ఆర్ఎఫ్సీఎల్ లో యూరియా ఉత్పత్తికి అవాంతరంగా మారిన సమస్యలను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన పరిష్కారం మాత్రం దొరకనట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. డెన్మార్స్ కంపెనీ ప్రతినిధులతో పాటు మరికొన్ని ఏజెన్సీలు సమన్వయం చేసుకుని ముందుకు సాగితే తప్ప మరో దారి లేనట్టుగా తెలుస్తోంది.

రూ. 200 కోట్లు…

HTRను బాగు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందని తెలుస్తోంది. దీనిని మరమ్మత్తు చేయాలంటే రూ. 150 నుండి 200 కోట్ల వరకు వెచ్చించాల్సిన అవసరం ఉంటుందని, దీనిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. HTRను బాగు చేయకుండా మరమ్మతులు చేసినా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం దొరకదని పరిశ్రమ వర్గాలు ఉన్నతాధికరులకు నివేదికలు పంపినట్టు సమాచారం. అంతేకాకుండా రామగుండం ఎరువుల కర్మాగారం మెయింటనెన్స్ కోసం సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉందని, మెయింటనెన్స్ చేసినట్టయితే ఇలాంటి సమస్యలను గుర్తించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Latest NewsNATIONALramgundamrfclUREA