పోలీసుల ముందు సంచలన వ్యాఖ్యలు
దిశ దశ, హైదరాబాద్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు శనివారం తెల్లవారు జామున వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ కు చెందిన పోలీసు అధికారుల బృందం ప్రత్యేకంగా హైదరాబాద్ కు వెల్లి ఆయనను అదుపులోకి తీసుకుంది.
కేసు పుర్వాపరాలివి…
కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డిని రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు పాడి కౌశిక్ రెడ్డి. అయితే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో వరంగల్ పోలీసులు అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలసింది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
సంచలన వ్యాఖ్యలు…
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మనోజ్ రెడ్డి నిర్వహిస్తున్న క్వారీ అనుమతికి మించి తవ్వకాలు జరిపిందని, ఈయన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజుల బినామీ అంటూ ఆరోపించారు. తనకు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఆ క్వారీతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తే అరెస్ట్ చేస్తారా..? తనపై పెట్టిన అక్రమ కేసు పెట్టారని, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తోందని ఈ విషయంలో నిలదీస్తామని వెల్లడించారు. 2.5 హెక్టార్లలో క్వారీకి అనుమతి తీసుకుంటే 20 ఎకరాల్లో క్వారీలో తవ్వకాలు సాగుతున్నాయని, స్థానిక ప్రజలు హెల్మెట్లు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి తయారైందని కౌశిక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.