మూడు రోజులుగా ట్రాక్టర్ అక్కడే…
గురువారం సాయంత్రం రిలీజ్…
దిశ దశ, మానకొండూర్:
ప్రజల ఆరోగ్యానికే సవాల్ గా మారిన కరీంనగర్ డంప్ యార్డ్ మెడికల్ వేస్టేజ్ కి కూడా అడ్డాగా మారినట్టుగా ఉంది. కరీంనగర్ ఆసుపత్రుల నుండి సేకరించే మెడికల్ వేస్టేజ్ కూడా ఇక్కడకే చేరుతోంది. కరీంనగర్ డంప్ యార్డులో ఇటీవలే మనిషి కాలు లభ్యమైన తరువాత కూడా కట్టడి చేసే వారు లేకుండా పోయారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. గత మూడు రోజులుగా మెడికల్ వేస్టేజ్ తో పాటు ఇతరాత్రా చెత్తను తరలించిన ఓ ట్రాక్టర్ ను డంప్ యార్డ్ ఇంఛార్జి పట్టుకున్నారు. మూడు రోజులుగా ఇక్కడి షెడ్డులోనే ఉన్న ఈ ట్రాక్టర్ గురువారం సాయత్రం రిలీజ్ అయింది. అయితే ఈ ట్రాక్టర్ పై ఫైన్ వేశారా, మెడికల్ వేస్టేజ్ తరలించిన సదరు ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. మునిసిపల్ ఎన్నికల విధుల్లో ఉండడంతో ట్రాక్టర్ వదిలేయడం వెనక అసలేం జరిగింది అన్న వివరాలు అయితే తెలియరావడం లేదు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో పాటు కరీంనగరంతో పాటు సమీపంలోని ప్రధాన ఆసుపత్రులకు సంబంధించిన మెడికల్ వేస్టేజ్ కూడా ఇదే డంప్ యార్డు వద్దకు చేరుతోందన్నది మాత్రం స్పష్టం అయింది. బల్దియా కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మెడికల్ వేస్టేజ్ సాధారణ చెత్తతో కలిపి పంపించిన ఆసుపత్రులపై జరిమానాలు కూడా విధించాలని ఆదేశించారు. దీంతో కరీంనగర్ పట్టణంలోని పలు ఆసుపత్రుల యాజమాన్యాలపై ఫైన్లు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మెడికల్ వేస్టేజ్ డంప్ యార్డ్ కు తరలించేందుకు సాహసిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డంప్ యార్డ్ సమస్య పరిష్కారిస్తామని నాయకులు ప్రకటించారంటే నగర వాసుల ప్రాణాలకు ఎంతటి ముప్పుగా మారిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ చెత్తతోనే సవాలక్ష రోగాల బారిన పడుతున్నామంటే మెడికల్ వేస్టేజ్ కూడా ఇదే డంప్ యార్డులో పడేస్తుండడం వల్ల సమీప కాలనీల వాసుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఆ విధానానికి మంగళం..?
ప్రైవేటు ఆసుపత్రుల నుండి సేకరించే మెడికల్ వేస్టేజ్ డంప్ యార్డులకు తరలించుకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా వేస్టేజ్ ను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యార్డులకు మాత్రమే తరలించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా మెడికల్ వేస్టేజ్ ని సపరేట్ ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. సాధారణ చెత్తను సేకరించేందుకు వెల్లే మునిసిపల్ వాహానాల్లో మెడికల్ వేస్టేజ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదని నిబంధనలు చెప్తున్నాయి. అనారోగ్యం బారిన పడిన వారికి చికిత్స అందించే మెడికల్ వేస్టేజ్ వల్ల సాధారణ ప్రజలు కూడా రోగాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆచరణలో పెట్టే విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ డంప్ యార్డులో ఇటీవల లభ్యమైన మనిషి కాలు, తాజాగా పట్టుకుని వదిలేసిన ట్రాక్టర్ ఘటనలే ఇందుకు ప్రధాన ఉదాహారణగా చెప్పవచ్చు. మెడికల్ వేస్టేజ్ విషయంలో కొన్ని ప్రైవేటు పెద్ద ఆసుపత్రులే సొంతగా వాహనాలను సమకూర్చుకుని తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సదరు ఆసుపత్రులకు సంబంధించిన ట్రాక్టర్లు మెడికల్ వేస్టేజ్ ని ఎక్కడకు తరలిస్తున్నాయన్న విషయంపై కూడా మునిసిపల్ యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.