ఆ లేఖతో తమకు సంబంధం లేదంటున్న జగన్
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యరద్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావ్ అలియాస్ DMపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారామేనని మావోయిస్టు పార్టీ కొట్టి పారేసింది. ఆయనపై గతంలోనూ ఇలాంటి దుష్ప్రచారాలు చేశారని ఆరోపించింది. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన ఓ లేఖలో దామోదర్ సరెండర్ అంశంపై క్లారిటీ ఇచ్చింది. బడే దామోదర్ లొంగుబాటుపై జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని జగన్ స్పష్టం చేశారు. గతంలోనూ అనేక సార్లు లొంగిపోతున్నారని, ఎన్ కౌంటర్ లలో చనిపోయారని ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళపరిచే ప్రయత్నం చేశారని, మానసిక యుద్దంలో భాగంగానే ఇలాంటి ప్రచారం జరుగుతోందని జగన్ పేర్కొన్నారు.
ఆ లేఖపై…
అలాగే జూన్ 25న మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన మరో లేఖపై కూడా జగన్ స్పందించారు. రాష్ట్ర మంత్రి సీతక్కపై ఆరోపణలు చేస్తూ మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన లేఖపై పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని, ఎన్ కౌంటర్లు ఆపాలని డిమాండ్ చేస్తోందని, మావోయిస్టు పార్టీ అంశం సామాజిక, రాజకీయలతో ముడిపడి ఉన్న సమస్య అని, అణిచివేతలతో మావోయిస్టు పార్టీని నిర్యూతించడం సరైన చర్య కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి అందిరికీ తెలిసిందేనన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము సీతక్కపై ఆరోపణలు చేసే అవకాశం లేదని, ఆ లేఖకు మావోయిస్టు పార్టీకి సంబంధం లేదని జగన్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినప్పటికీ పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీకి సహకరించవద్దని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కొనసాగినట్టయితే తమకు సమాచారం ఇవ్వాలని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ ప్రజలను పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారని జగన్ ఆరోపించారు.