మేయర్ కొలగాని… డిప్యూటీ సునీల్ రావ్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా వై సునీల్ రావు పేర్లను ప్రతిపాదించింది బీజేపీ పార్టీ. కొద్ది సేపటి క్రితం కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ముగిసింది. అనంతరం జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక ప్రక్రియలో వీరిద్దరిని ఎనుకోనున్నారు.

పరిశీలన ఇలా…

శుక్రవారం మెజార్టీ స్థానాలు సాధించిన తరువాత స్వతంత్రుల మద్దతు కూడా అందిపుచ్చుకున్న బీజేపీ కార్పొరేటర్లను క్యాంపునకు తరలించింది. మేయర్, డిప్యూటీ మేయర్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలోనన్న విషయంపై బీజేపీ నాయకత్వం పలు సమీకరణాలు చేసింది. సామాజిక వర్గాలు, పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగిన వారు, సీనియర్ కార్పొరేటర్లు తదితర అంశాలను పరిగణణలోకి తీసుకుని బీజేపీ పెద్దలు కసరత్తులు చేశారు. బీసీ జనరల్ కావడంతో ముదిరాజ్ లేదా పద్మ శాలి సామాజిక వర్గానికి చెందిన వారికి మేయర్ పదవిని కట్టబెట్టాలని బావించినప్పటికీ సంఘ్ పరివార్ తో సంబంధాలున్న వారి పేర్లను పరిశీలించాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి కార్పొరేషన్ లో గెలిచిన వారిలో కొలగాని శ్రీనివాస్ పేరును సంఘ్, పార్టీతోనే అనుబంధం కొనసాగిస్తున్నారని గుర్తించారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారి పేర్లను పరిశీలించాల్సి వచ్చింది. మహిళ అయితే చొప్పరి జయశ్రీ పేరు తెరపైకి రాగా, పద్మశాలి సామాజిక వర్గం నుండి వాసాల రమేష్ పేరు పరిశీలనకు వచ్చింది. ఈ సారి బీజేపీ తరుపున గెల్చిన వారిలో 11 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి చేరిన వారే కాగా ఎక్కువ మంది తొలిసారి కార్పొరేషన్ లో అడుగుపెడుతున్న వారే ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై సీనియర్లను కూర్చోబెడితేనే అన్నింటా మంచిదన్న ఆలోచనతో ఉన్న బీజేపీ నాయకత్వం ఆ దిశగానే అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. చివరకు కొలగాని శ్రీనివాస్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. డిప్యూటీ మేయర్ గా తాజా మాజీ మేయర్ వై సునీల్ రావు పేరును ఖరారు చేసింది.

మహా ఫార్మూలా…

కరీంనగర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో మహారాష్ట్ర ఫార్మూలాను కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుసరించినట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా పని చేసిన ఫడ్నవిస్ ను షిండే సర్కార్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని అధిష్టానం ఆదేశించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఫడ్నవిస్ సీఎం కాగా షిండే డిప్యూటీ సీఎంగా పని చేస్తున్నారు. ఇదే విధానాన్ని అవలంబించి కరీంనగర్ తాజా మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావును డిప్యూటీ మేయర్ గా ఎంపిక చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ఏది ఏమైనా ప్రోటో కాల్ విషయంలో తొలి ప్రాధాన్యం లభించే పదవిలో కొనసాగిన నాయకుడు ఇప్పుడు సెకండ్ ప్రోటోకాల్ పోస్టులో కొనసాగనున్నారు. రిజర్వేషన్ కారణంగా కరీంనగర్ బీసీ జనరల్ కావడంతో జనరల్ కేటగిరీకి చెందిన సునీల్ రావు డిప్యూటీతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.

2026 Municipal ElectionskarimnagarKarimnagar mayormuncipal electionsTG NEWS
Comments (0)
Add Comment