కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్..
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలపై జరిమానా విధించడం ఆరంభించారు. వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ స్ఫష్టంగా కనిపించకుండా జాగ్రత్త పడుతున్న వారు తప్పును సరిదిద్దుకోవల్సిందే ఇక అంటున్నారు ట్రాఫిక్ పోలీసు అధికారులు. నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనానలు గుర్తించేందుకు శనివారం కరీంనగర్ అంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఒక్క రోజే 73 వాహనాలను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఆయా వాహనలకు జరిమానా విధించడమే కాకుండా నంబర్ సరిగా కనిపించే విధంగా నంబర్ ప్లేట్లు తయారు చేయించి అమర్చేందుకు కూడా చొరవ తీసుకున్నారు. ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కరీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇక ముందు కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇలాంటి వాహనాలను గుర్తించి జరిమానా విధిస్తామని కరీముల్లా ఖాన్ స్పష్టం చేశారు. వాహనదారులు ఇష్టారీతిన నంబర్ ప్లేట్లు అమర్చుకుని ట్రాఫిక్ రూల్స్ అతి క్రమించినప్పుడు పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కకుండా తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్లు సరిగా కనిపించకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నంబర్ ప్లేట్ల విషయంలో కరీంనగర్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం.