మిస్టరీ మర్డర్ ఛేదించిన పోలీసులు…
దిశ దశ, కరీంనగర్:
తాళి కట్టిన ఆలిని… తల్లిదండ్రులను పోషించాలన్న తపనతో విదేశాలకు వెల్లిన అతన్నికుటుంబ ‘‘బంధమే’’ బలి తీసుకుంది. కుటుంబ పోషణ కోసం దేశం కానీ దేశం వెళ్లిన భర్త పరిస్థితిని పట్టించుకోని భార్య… కోడలితో వివాహేతర బంధం కొనసాగించవద్దని విచక్షణ మరిచిన తండ్రి కలిసి వేసిన పథకానికి బలయ్యాడో అభాగ్యుడు. ప్రమాద వశాత్తుగా మరణించాడని సీన్ క్రియేట్ చేసిన సుపారీ గ్యాంగ్ గుట్టును పోలీసులు రట్టు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మర్డర్ మిస్టరీరి సంబంధించిన వివరాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ కు చెందిన గాదె అంజయ్య (36) డిసెంబర్ 5న ఎస్సారెస్పీ కెనాల్ లో శవమై తేలాడు. అనుమానస్పద స్థితిలో అంజయ్య మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు విభిన్న కోణాల్లో ఆరా తీయడం మొదలు పెట్టారు. కెనాల్ లో ప్రమాదవశాత్తు జారి పడడంతో అంజయ్య మరణించడా లేక, కావాలనే హత్య చేసి యాక్సిడెంటల్ డెత్ గా క్రియేట్ చేశారా అన్న అనుమానం పోలీసులను వెంటాడడంతో దర్యాప్తు మొదలు పెట్టారు.
అసలేం జరిగిందంటే..?
గాదె అంజయ్య ఉపాది కోసం 2017లో విదేశాలకు వెల్లి 2019లో తిరిగి వచ్చాడు. మృతుడు విదేశాలకు వెల్లినప్పుడు మామ లచ్చయ్య (63) తన కోడలు శిరీషతో వివాహేతర బంధం కొనసాగించాడు. విదేశాల నుండి వచ్చిన అంజయ్య వీరిద్దరి వివాహేతర బంధాన్ని గమనించి పద్దతి కాదని మందలించాడు. దీంతో అంజయ్య అడ్డు తొలగించుకోవాలని భావించిన లచ్చయ్య, శిరీషలు అతన్ని చంపేందుకు కొలిపాక రవి అనే వ్యక్తి సహకారం కోరడంతో పాటు సూపారి ఇచ్చేందుకు కూడా సమ్మతించారు. దీంతో రవి ఉప్పరపల్లి కోటేశ్వర్, మహమ్మద్ అబ్రార్ లు అంజయ్యను చంపేందుకు రూ. 3 లక్షల డీల్ కుదిర్చాడు. అప్పటి నుండి కోటేశ్వర్, అబ్రార్ లు అంజయ్యతో సన్నిహితంగా మెదులుతూ విందులు వినోదాలు చేసుకోవడం మొదలు పెట్టారు. డిసెంబర్ 2న దావత్ చేసుకుందామని ఊరి చివర ఉన్న కెనాల్ వద్దకు పిలిపించుకున్న సూపారీ గ్యాంగ్ అతనికి ఫుల్లుగా మద్యం తాగించారు. మత్తులోకి జారుకున్న అంజయ్య గొంతు కోటేశ్వర్ నులిమగా, అబ్రార్ అతని చేతులు పట్టుకుని హత్య చేశారు. మర్డర్ చేసేందుకు ఒప్పందం కుదర్చిన రవి అంజయ్య హత్య విషయాన్ని అతని తండ్రి లచ్చయ్యకు చేరవేశాడు. అయితే అంజయ్యది హత్య కాదని ప్రమాదవశాత్తుగా మరణించాడన్న సీన్ క్రియేట్ చేసేందుకు అతని మృతదేహాన్ని D-8 కెనాల్‌లోకి తోసేశారు. డిసెంబర్ 5వ తేదిన కాలువలో శవం లభ్యం కావడంతో పోలీసులు అనుమానించిన పోలీసులు ఆరా తీయగా మామ, కోడలు మధ్య ఉన్న అతి సాన్నిహిత్యమే ఇందుకు ప్రధాన కారణమని తేల్చారు. దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా సూపారి ఇచ్చింది… హత్య చేయించడానికి కారణమేంటో కూడా పోలీసులకు వివరించారు. ఈ కేసులో నిందితులైన గాదె లచ్చయ్య (63), గాదె శిరీష (32), ఉప్పరపల్లి కోటేశ్వర్ (31), మహ్మద్ అబ్రార్ (23), మీడియేటర్ గా వ్యవహరించిన కొలిపాక రవి (55)లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. నిందితుల నుండి మొబైల్ ఫోన్లు, బైక్, రూ. 40 వేల నగదు రికవరీ చేశామని తెలిపారు. అంజయ్య మర్డర్ మిస్టరీని ఛేదించడంలో సఫలం అయిన బృందాన్ని ఈ సందర్భంగా పోలీసు అధికారులు అభినందించారు.