బదిరుల భాషలో జాతీయ గీతాలాపన…

కలెక్టర్ పమేలా సత్పతి చొరవ…

దిశ దశ, కరీంనగర్:

దూరదర్శన్ వంటి కొన్ని ఛానెల్స్  మాత్రమే వారి కోసం ప్రత్యేక వార్తా ప్రసారాలు చేస్తుంటాయి. బదిరుల వార్తలు ప్రసారం అయ్యేప్పుడు ఆ చేతి సైగలు అర్థం కాక వ్యాఖ్యానం చేసే యాంకర్ మాటలు వినేందుకు సాధారణ శ్రోతలు చెవులు రిక్కించి మరీ వినేవారు. కొంతమంది అయితే బదిరుల వార్తలు మనకెందుకులే అని టీవీని ఆప్ చేసేవారు. కానీ వారి సైగలకు ఓ అర్థం ఉంటుంది… వారిలోనూ ఓ ఆవేదన ఉంటుంది… వాటిని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని గమనించిన ఆ కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వీరొస్తే ఎలా..? వారి సమస్యను పరిష్కారించేందుకు అధికార యంత్రాంగం చొరవ తీసుకునే పరిస్థితి ఉంటుందా..? మూగ మనషులు చేస్తున్న సైగలు అర్థం కాక వారి అవసరాలను తీర్చే పరిస్థితి ఉండదు కదా… వారి భావాలను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగమే సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బావుంటుంది కదా అన్న ఆ ఆలోచన మదిలో మెదలడంతో ఇందుకు అవసరమైన కార్యచరణ రూపొందించి కార్యరంగంలోకి దిగారు ఆ కలెక్టర్.

తన నుండే…

ఆచరణలో పెట్టాలని ఆదేశించడం సాధారణం కానీ… ఆచరించాలని తపన పడే వారు మాత్రం కొందరే ఉంటారు. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. జిల్లా యంత్రాంగానికి సైన్ లాంగ్వేజ్ నేర్పించాలని భావించి ప్రత్యేకంగా బోధకులను నియమించారు. తొలి విడుత ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పని చేస్తున్న వారికి అవగాహన కల్పించారు. అయితే  బదిరుల భాషపై పట్టు సాధించేందుకు కేవలం యంత్రాంగాన్ని పురమాయించడమే కాకుండా… జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కూడా ముందుకు రావడం విశేషం. సైన్ లాంగ్వేజ్ నేర్చుకునేందుకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు పమేలా సత్పతి. ఈ లాంగ్వేజ్ నేర్చుకుని బదిరుల మనసుల్లోని భావాలను అర్థం చేసుకున్నట్టయితే వారి అవసరాలు తీర్చడం సులువు అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు కరీంనగర్ కలెక్టర్.

తొలిసారిగా…

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో పాటు ఇతర జిల్లా అధికారులు బదిరులతో కలిసి జాతీయ గీతాలాపన సైన్ లాంగ్వేజ్ లో చేశారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని బదిరులు జాతీయ గీతాలాపన చేస్తుంటారు. కానీ కరీంనగర్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతాన్ని ఆలపించడం హైలెట్ గా నిలిచింది. పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేసేందుకు ముఖ్య అతిథిలుగా వచ్చే మంత్రి సమక్షంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా కళారూపాల ప్రదర్శన, స్టాల్స్ సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆయా జిల్లాల్లో ప్రత్యేకతను ప్రదర్శించేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు… కానీ కరీంనగర్ పరేడ్ గ్రౌండ్ మాత్రం అంత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. అప్పటి వరకూ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు వేదికపై ఉన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు బదిరులతో కలిసి ప్రదర్శన ఇచ్చేందుకు పరేడ్ గ్రౌండ్ లోకి చేరుకోవడం విశేషం. ఉన్నతాధికారులే సైన్ లాంగ్వేజ్ ద్వారా నేషనల్ అంథెమ్ ఆలపించేందుకు కరీంనగర్ పరేడ్ గ్రౌండ్ వేదికగా నిలవడం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టయింది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ఈ చొరవ దేశ వ్యాప్తంగా ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. దేశంలోనే ఏ ఐఏఎస్ అధికారి కూడా బదిరుల బాషలో జాతీయ గీతాన్ని ఆలపించిన సందర్భాలు లేకపోవచ్చు. ఇందుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి శ్రీకారం చుట్టి ఉంటారని తెలుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బదిరుల భాషమై మక్కువ పెంచుకుని, పరిపూర్ణమైన అవగాహన పెంచుకున్నతీరు చూసి అబ్బురపడి పోయారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర పమేలా సత్పతి, ఇతర అధికారుల చొరవను ప్రత్యేకంగా అభినందించారు.

karimnagar newsPamela Satpathy iasPamela Satpati IAStelangana newsTG NEWS