TELANGANA POLICE: శునకాల ఉద్యోగ విరమణ..!

ఘనంగా సత్కరించిన సీపీ…

దిశ దశ, కరీంనగర్:

అక్కడ శునకాలు పదవీ విరమణ పొందాయి. రిటైర్మెంట్ సందర్భంగా వాటికి అత్యంత ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు అధికారులు.

జాగిలాల స్పెషల్…

సాధారణంగా పదవి విరమణ పొందనున్న ఉద్యోగులకు మాత్రమే ఆయా విభాగాల అధికారులు సత్కరించటం సాంప్రాదాయంగా వస్తోంది. కానీ పోలీసు విభాగంలో మాత్రం ఉద్యోగం చేసిన మనుషులకే కాదు… జాగిలాలకు కూడా వీడ్కోలు చెప్పే ఆనవాయితీ కొనసాగుతోంది. నేరాల దర్యాప్తులో పోలీసులతో మమేకం అయ్యే శునకాలకు ప్రత్యేకత ఉంటుంది. నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు జరిపే సెర్చింగ్ ఆపరేషన్ లో జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలను బట్టి అనుమానితులను జాగిలాలు వాసన చూసి ఇట్టే పట్టుకుంటాయి. పోలీసు విభాగంలో జాగిలాల సీనియారిటీ, ప్రతిభ ఆధారంగా జాగిలాలలకు క్యాడర్ ను బట్టి పదోన్నతులు కూడా ఇస్తుంటారు. వీటి ఆహారం, శిక్షణ, శారీరక ధారుడ్యం వంటి వాటిని చూసుకునేందుకు వాటి హోదాను బట్టి పోలీసు సిబ్బందిని కెటాయిస్తారు. వారే ఆ జాగిలాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇదే విభాగంలో పదేళ్ల పాటు సేవలందించిన రెండు జాగిలాలలకు కరీంనగర్ పోలీసులు వీడ్కోలు ఏర్పాటు చేశారు.

సత్కారం...

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో దశాబ్ద కాలంగా సేవలు అందించిన పోలీస్ జాగిలాలు డానీ (డాబర్ మెన్), టైగర్ (జర్మన్ షెపర్డ్)లు మంగళవారం ఉద్యోగ విరమణ చేశాయి. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం అస్త్ర కన్వెన్షన్‌లో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.10 ఏళ్లుగా డానీ,11 సంవత్సరాలుగా టైగర్ లు డాగ్ స్క్వాడ్ విభాగానికి విశేష సేవలందించాయి. దొంగతనాలు, హత్య కేసులలో ట్రాకర్ డాగ్‌లుగా కీలక పాత్ర పోషించాయి. 2014లో టైగర్, 2015లో డానీ పోలీసు శాఖలో చేరాయి. ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీస్ జాగిలాలను సీపీ గౌష్ ఆలం పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా టైగర్‌కు హ్యాండ్లర్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్ మహేందర్, డానీకి హ్యాండ్లర్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్ జి. మురళిలను కూడా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ… పోలీస్ శాఖలో జాగిలాల విభాగం అత్యంత కీలకమైనదన్నారు. నేరస్తులను పట్టుకోవడంతో పాటు, పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలను గుర్తించడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు శ్ర వెంకటరమణ, భీం రావు, ఆర్‌ ఐ రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

flash newskarimnagar newsPolice dogstelangana policeTG NEWS