దిశ దశ, హుజురాబాద్:
రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్న ప్రకటన వెలువడగానే ప్రజలు తమ గళాన్ని వినిపించేందుకు ముందుకు వస్తున్నారు. హుజురాబాద్ కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో పట్టణ వాసులు ఆందోళన చేపట్టారు. భారత ప్రధానిగా సేవలందించిన ఆర్థిక పితామహుడు పివి నరసింహరావు పేరిట హుజురాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం హుజురాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ పివి పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
దశాబ్దాలుగా…
హుజురాబాద్ సమీపంలోని వంగెరకు చెందిన పివి నరసింహరావు స్వాతంత్ర్య సమరయోధునిగా జాతీయ, ప్రాంతీయోద్యమాల్లో పాల్గొన్నారు. జర్నలిస్టు, కవి, బహుభాషా కోవిధులైన పివి నరసింహరావు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మంథని నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా సేవలందించారు. హన్మకొండ, రాంటెక్, నంద్యాల నుండి ఎంపీగా గెలిచిన ఆయన కేంద్రంలో వివిధ కీలకమైన శాఖలు నిర్వర్తించి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పేరిట హుజురాబాద్ లేదా మంథని కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే డిమాండ్ వినిపించారు. కొత్త జిల్లాల ఆవిర్భావ సమయంలో కూడా పివి పేరిట జిల్లా ఏర్పాటు చేయాలన్న కోరికను హుజురాబాద్ వాసులు వెలిబుచ్చినప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడంతో లాభం లేకుండా పోయింది. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా పివి పేరిట జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హుజురాబాద్ కేంద్రంగా పివి జిల్లాను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశం తెరపైకి రాలేదు. తాజాగా ప్రభుత్వం ఈ విషయంపై స్పందించడంతో ఇప్పుడైనా హుజురాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ కోరుతోంది.
అక్కడ రెండే… ఇక్కడ ఆరు…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన క్రమంలో అతి తక్కువ జనాభా ఉన్న సిరిసిల్లను జిల్లాకేంద్రంగా ప్రకటించారని జేఏసీ ప్రతినిధులు అంటున్నారు. కేవలం 2 లక్షల జనాభాకే రాజన్న సిరిసిల్ల జిల్లాను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అయితే హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో జనాభా దాదాపు 6 లక్షల వరకూ ఉంటుందన్న విషయాన్ని గమనించాలని వారు అంటున్నారు. సిరిసిల్ల కన్న ఎక్కువ జనాభా ఉన్న హుజురాబాద్ కేంద్రంగా పివి జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.