గందరగోళంలో పౌర సంబంధాల శాఖ…
దిశ దశ, హైదరాబాద్:
జర్నలిజంలో అత్యంత అరుదైనదిగా మారిపోయిన అక్రిడిటేషన్ జారీ చేసే విధానంపై ఇంకా స్ఫష్టత లేకుండా పోయింది. అయోమయం జగన్నాథం అన్నట్టుగా మారినా సరైన పరిష్కారం చూపేవారు లేకుండా పోయారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్ స్థాయిలో తీసుకోవల్సిన నిర్ణయాలు రోజుకో తీరు అన్నట్టుగా ప్రచారం అవుతున్నాయే తప్ప సరైన మార్గనిర్దేశం చేసేలా లేవన్న అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. కొత్త జీఓ తీసుకొచ్చిన తరువాత లోపాలను సవరించినా కూడా కార్డులు ఇచ్చే విషయంపై ఎక్కడా క్లారిటీ లేకుండా పోయిందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇలా ఎలా..?
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల సీనియారిటీ ఉన్నట్టయితే విద్యను ప్రామాణికంగా తీసుకోవల్సిన అవసరం లేదని నిర్ణయించారు. అయితే ఈ సారి కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ కేవలం స్టాఫ్ రిపోర్టర్లకు మాత్రమే అమలు చేయాలని మండల రిపోర్టర్లు ఖచ్చితంగా ఇంటర్మీడియెట్ చదివి ఉండాల్సిందేనన్న నిబంధన విధించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాల కాలంగా వృత్తితో మమేకమైన వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధన విధించలేదు. దీంతో రాష్ట్రంలో చాలమంది గ్రామీణ, పట్ణణ విలేకరులు అక్రిడేషన్ కార్డులకు అర్హత సాధించలేకపోతున్నారు. ఈ నిబంధనను సవరించాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ ఇంతవరకూ పౌరసంబంధాల శాఖ అధికారులు స్పందించలేదు.
ఒకటి అరా…
ఇకపోతే అక్రిడిటేషన్ కార్డులు ప్రస్తుతం ఉన్న నిబంధనలు పరిశీలిస్తే జిల్లాకు ఒకటి అరా తప్ప వృత్తిలో కొనసాగతున్న వారందరికి వచ్చే అవకాశాలు లేకుండా పోయింది. సర్క్యూలేషన్ ఆధారంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలన్న నిబంధన విధించినా ప్రధాన కార్యాలయం నుండి ఇంతవరకూ వీటి వివరాలు జిల్లాలకు చేరలేదు. జిల్లాల్లో, ఎడిషన్ సెంటర్లలో సర్క్యూలేషన్ ను ఎలా ప్రామాణికం తీసుకోవాలోనన్న విషయంపై స్పష్టత లేకుండా పోయంది. దీంతో చాలా జిల్లాల్లో అక్రిడిటేషన్ కమిటీలు హైదరాబాద్ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని భావిస్తున్నాయి. అయితే ఏప్రిల్ 30న గురువారం సాయంత్రం కమిటీ సమావేశం అవుతున్న నేపథ్యంలో ఇందులో తీసుకునే నిర్ణయాలను గమనించాలని రాష్ట్రం అంతా ఎదురు చూస్తోంది.
గడువు…
ఇకపోతే అక్రిడిటేషన్ కార్డులను రెన్యూవల్ చేసే విషయంలో ఇంతవరకూ ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. కొత్త కార్డులు మే 10 లోగా ఇవ్వాలని ఐ అండ్ పీ ఆర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏప్రిల్ 28న వెలువడ్డ ఈ ఉత్తర్వుల ఆధారంగా అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి..? నిర్ణయాలు తీసుకునేదెప్పుడూ..? కొత్త కార్డులు ప్రింట్ అయి జారీ చేసేదెప్పుడూ..? అన్న విషయంపై వారికే తెలియాలి. ఇప్పటి వరకు ఉన్న అక్రిడిటేషన్ కార్డులు ఏప్రిల్ 30తో ముగుస్తున్నందున కొద్ది రోజుల పాటు అక్రిడిటేషన్ కార్డులు లేకుండానే కవరేజ్ చేయాల్సిన పరిస్థితి తయారు కానుంది. వీఐపీలు పర్యటించినప్పుడు సమావేశాలకు హాజరయ్యే జర్నలిస్టులకు కార్డులు లేకుండా పాసులు ఎలా జారీ చేస్తారో అధికారులకే తెలియాలి. మరో వైపున అక్రిడిటేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా జిల్లాల్లో నడుచుకోవాలని భావిస్తున్నా వారు ఏఏ అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారోనన్న విషయంపై జిల్లా కమిటీలు అవగాహన చేసుకోవల్సిన అవశ్యకత కూడా ఉంది. వీటన్నింటిని స్టడీ చేసే వరకూ జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల పరిస్థితి ఏమిటన్నదే అర్థం కాకుండా పోతోంది.
కార్డుల సంఖ్య…
రాష్ట్రంలో అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య అడ్డగోలుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కార్డులు జారీ చేసే ముందు ప్రతి సంస్థ ఇచ్చే జాబితాలను సునిశితంగా పరిశీలించాల్సిన అవశ్యకత ఏర్పడింది. దీనివల్ల అసలైన జర్నలిస్టులను మాత్రమే అర్హులుగా గుర్తించి మిగతా వారిని అనర్హులుగా జాబితాల నుండి తొలగించాల్సి ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు సమయం ఎంత పడుతుందోనన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.