దిశ దశ, కరీంనగర్:
ఓ వైపున బీజేపీ నాయకత్వం పరిపూర్ణమైన మెజార్టీ అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమై మ్యాజిక్ ఫిగర్ అందుకునేందుకు స్వతంత్రులు, రెబెల్స్ అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతోంది… మేయర్ డిప్యూటీ మేయర్ ఎవరన్న విషయంపై పార్టీ ఇంకా స్పష్టత కూడా ఇవ్వలేదు. కానీ కరీంనగర్ లో మాత్రం అప్ కమింగ్ డిప్యూటీ మేయర్ అంటూ వెలిసిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది.
మ్యాజిక్ ఫిగర్ కోసం…
కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లు ఉండగా భారతీయ జనతా పార్టీ 30 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన రెబెల్స్ తో పాటు స్వతంత్రులను పార్టీలో చేర్పించుకునే పనిలో పడింది పార్టీ. ఫలితాలు వెలువడిన శుక్రవారం మద్యాహ్నం నుండే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పష్టమైన మెజార్టీ కోసం పావులు కదుపుతున్నారు. ఒక్కో స్వతంత్ర అభ్యర్థితో చర్చలు జరిపి నలుగురిని పార్టీలో చేర్పించుకున్నారు. శనివారం సాయంత్రం అధికారికంగా ఇద్దరు కార్పొరేటర్లు బీజేపీలో చేరడంతో కార్పొరేషన్ లో పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించినట్టయింది. సోమవారం జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికలో బీజేపీ పార్టీ కార్పొరేటర్లు అధికారికంగా బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే ఇప్పటి వరకూ పార్టీ కానీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ ఫలనా వారికి పదవులు కట్టబెడ్తామని మాత్రం ప్రకటించలేదు.
ఫ్లెక్సీలో అలా…
కరీంనగర్ లో వెలిసిన ఓ ఫ్లెక్సీ ఇంటా బయటా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కార్పొరేటర్లంతా క్యాంపునకు తరలి వెళ్లగా వారితో బీజేపీ నాయకత్వం ఇంకా సమావేశం కూడా నిర్వహించలేదు. కానీ శనివారం ఉదయమే వెలిసిన ఫ్లెక్సీ సరికొత్త చర్చకు దారి తీసింది. అప్ కమింగ్ డిప్యూటీ మేయర్ అంటూ 66 డివిజన్ నుండి గెలిచిన బీజేపీ కార్పొరేటర్ వంగల పవన్ ఫోటో వేసి ఆయన సన్నిహితులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో అధిష్టానం నిర్ణయానికి ముందే వంగల పవన్ కాబోయే డిప్యూటీ మేయర్ అంటూ ఫ్లెక్సీ ప్రత్యక్ష్యం కావడం సంచలనంగా మారింది. డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెడ్తామన్న సంకేతాలు పవన్ కు పంపించారా లేక ఆయనకు నాయకత్వంపై ఉన్న అత్యంత నమ్మకమో తెలియదు కానీ ఆయన సన్నిహితుడు మాత్రం బాజాప్తాగా కాబోయే డిప్యూటీ మేయర్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గమనార్హం.