జవహర్ నవోదయ తీరుపై అభ్యంతరాలు…
దిశ దశ, కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినప్పటికీ అర్హులైన వారిని మాత్రం కొత్త జిల్లా నుండే ఎంపిక చేయడం విస్మయం కల్గిస్తోంది. విశాల ధృక్ఫథంతో ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులను చేర్చుకునేందుకు తీసుకున్న నిర్ణయం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జగిత్యాలలో…
ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా జగిత్యాల జిల్లాలో జవహర్ నవోదయ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పాఠశాలలో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ ఆ జిల్లా వారికే ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవంగా నవోదయ పాఠశాలల్లో సీటు కోసం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహాణ కోసం జగిత్యాల పాఠశాల ఏర్పాటు చేయకముందే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో అర్హత ప్రామాణికంగా జగిత్యాల నవోదయ పాఠశాలలో అడ్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుందని పేరెంట్స్ అంటున్నారు. కానీ అధికారులు మాత్రం జగిత్యాల జిల్లా వారికే అవకాశం కల్పించడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చొప్పదండి నవోదయ పాఠశాలకు మాత్రం జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చినప్పటికీ జగిత్యాల పాఠశాలలో మాత్రం అదే జిల్లాకు పరిమితం చేయడం సరికాదని అంటున్నారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణకు, సంబంధిత అదికారులకు వినతి చేశామని విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారు. వచ్చే ఏడాదికి సంబంధించిన అడ్మిషన్స్ ప్రక్రియకు కూడా ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకునే నోటిఫికేషన్ ఇచ్చారని వారు వివరించారు. కానీ జగిత్యాలలో మాత్రం అదే జిల్లా వారికి అడ్మిషన్స్ ఇవ్వడం వల్ల ఉమ్మడి జిల్లా వారికి అవకాశం కల్పించకపోవడం వల్ల తీరని నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నవోదయ కేంద్రంలో విద్యా బోధన ఇంకా ప్రారంభం కానందున ఉమ్మడి జిల్లా నుండి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.