డబ్బు మద్యానికి దూరం… హామీలు నెరవేర్చనట్టయితే నాదే నేరం…

చెప్పులు మెడలో వేసుకుంటానని వెల్లడి…

సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం…

దిశ దశ, మానకొండూరు:

ఓటర్లను ప్రలోభ పెట్టి అధికారం దక్కించుకునేందుకు బరిలో నిలిచే అభ్యర్థులు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. డబ్బు, మద్యం పంపిణీ చేయడం,  అభివృద్ది చేస్తానని హామీలు కురిపించడం, కుల సమీకరణాలు, పెద్దల ప్రాపకం పొందేందుకు శ్రమించడం వంటివి సాధారణంగా జరిగే తంతే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే ఇలాంటి వ్యూహాలు మరింత ఎక్కువగానే ఉంటాయి. అయితే ఓ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థి మాత్రం వినూత్నంగా ప్రచారానికి తెరలేపారు.

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాస్తా వెరైటీగానే తన ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. పంచాయితీ అభివృద్ది కోసం తాను చేయబోయే పనులు ఏమిటో తన విజన్ ఏంటో వివరిస్తూ గుమ్మడవెల్లి రాజేశ్వరి (వైశాలి) ఓ బాండ్ పేపర్ విడుదల చేశారు. అయితే తాను ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం పంపిణీ చేయనని, డబ్బులు పంచేది లేదని గ్రామ అభివృద్ది కోసం తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. గ్రామంలో 12 పడకల ఆసుపత్రి, ఓపెన్ జిం, అంగన్ వాడీ కేంద్ర అభివృద్ది, గ్రామంలో పనిచేయకుండా ఉన్న బోర్లను బాగు చేయించడం, కూరగాయల మార్కెట్ ఏర్పాటు, గ్రంథాలయాన్ని అభివృద్ది చేయడంతో పాటు మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా చేస్తానని బాండ్ పేపర్లో పేర్కొన్నారు.

అలా చేయకపోతే…

తనను గెలిపించిన తరువాత ఇచ్చిన హామీలు నెరవేర్చనట్టయితే ఆ నేరం కూడా తనపైనే వేసుకుంటానని కూడా రాజేశ్వరీ పేర్కొనడం గమనార్హం. బాండ్ పేపర్ లో పేర్కొన్నట్టుగా తాను ఇచ్చిన హామీలు అమలు చేయనట్టయితే కులానికో చెప్పు చొప్పన దండ తయారు చేసుకుని మెడలో వేసుకుని తన పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు పావులు కదపడమే కాదు… తనను గెలిపించిన తరువాత గ్రామ అభివృద్ది కోసం పాటు పడనట్టయితే చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తానని స్పష్టం చేయడంతో సరికొత్త చర్చ మొదలైంది. రాజేశ్వరీ విడుదల చేసిన ఈ బాండ్ పేపర్ వైరల్ కావడంతో వివిధ ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా మారింది.