మావోయిస్టు పార్టీ మాజీ నేత దేవ్ జీ…
దిశ దశ, కోరుట్ల:
దోపిడీ పీడన లేని సమ సమాజ నిర్మాణం కావాలన్న ప్రేరణతోనే అజ్ఞాతంలోకి వెళ్లానని మావోయిస్టు పార్టీ మాజీ నేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ అన్నారు. ఆర్థిక, సామాజిక, కుల, మతం ప్రాతిపదికన అంతరాలు ఉండకూడదన్నదే తన అభిప్రాయమన్నారు. బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కోరుట్లలోని తన ఇంటికి వచ్చిన ఆయనకు పట్టణంలోని అన్ని వర్గాల వారు సాదర స్వాగతం తెలిపారు. తన కుటుంబ సభ్యులతో పాటు అనాడు తనతో అనుబంధం ఉన్నవారిని వ్యక్తిగతంగా కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా దేవ్ జీ మీడియాతో మాట్లాడుతూ… నలభై ఏళ్ల తరువాత తన ఇంటికి రావడం సంతోషంగా ఉందని, ప్రాణాలతో బయటకు వస్తానని ఊహించలేదని వ్యాఖ్యానించారు. తనకు అనుబంధం ఉన్రన కోరుట్ల పట్టణానికి చెందిన వారిని గురువారం కలవనున్నానని వెల్లడించారు. కోరుట్ల పట్టణమే తన ఇంటిలా భావిస్తున్నానని చెప్పిన తిపిరి తిరుపతి ప్రజలు ఎక్కడికి పిలిస్తే అక్కడకు వెళ్తానని, తాను ఇక నుండి కూడా ఇంటివరకే, వ్యక్తిగత జీవితానికే పరిమితం కాదల్చుకోలేదని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగానే ప్రజా సమస్యల కోసం ముందుకు సాగుతానని, వివాదాలకు తావిచ్చే విధంగా మాట్లాడడం సరికాదని అనకుంటున్నానన్నారు.
సుమ పోస్టులపై….
అజ్ఞాతంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేసిన తమ్ముని కూతురు తిపిరి సుమ గురించి కూడా స్పందించారు దేవ్ జీ. తనతో తన సహచరుల గురించి కూడా రాసిందనే భావించామని వ్యాఖ్యానించారు. సుమ అభిప్రాయం అజ్ఞాతంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు సంబంధించినదిగానే అనుకున్నామన్నారు.