నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే… అభివృద్ది కోసం కలిసి పని చేస్తున్నా: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్

దిశ దశ, జగిత్యాల:

ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని, జగిత్యాల అభివృద్ది కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నేటికీ తన జీతం నుండి నెలకు రూ. 5 వేలు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ చేరుతోందని, తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ కూడా ఇచ్చానన్నారు. పెండింగ్ బిల్లుల కోసం తాను ప్రభుత్వాన్ని అభ్యర్థించి నిధులు విడుదల చేయించుకున్నానే తప్ప కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ప్రకటించలేదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.

మీడియాలో…

జగిత్యాల అభివృద్ది కోసం తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది వాస్తవమేనని నిధుల విడుదల కోసం సీఎంను అభ్యర్థించిన సందర్భంగా శాలువాతో సత్కరించానని, తనకు కూడా సీఎం కండువా కప్పారన్నారు. అయితే ఆ ఫోటోలు బయటకు రాగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా మీడియాలో కథనాలు రాగానే తనపై దాడులు చేశారని డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు. జగిత్యాలలోన తన హస్పిటల్ పై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ అదే రోజున పార్టీ ఫిరాయించినట్టుగా పిర్యాదు చేసిందన్నారు. ఆ తరువాత సీఎం కానీ తనతో పాటు ఉన్న మంత్రులు కానీ తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ప్రకటించలేదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఈ విషయంపై తనకు బీఆర్ఎస్ అధిష్టానం ఏనాడూ నోటీసు ఇవ్వలేదని, సంజాయిషీ కూడా అడగలేదన్న విషయం గమనించాలన్నారు. తాను ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని విమర్శించలేదని, బిల్లుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసినట్టయితే అందుకు అనుగుణంగానే నడుచుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే తనకు దూరంగా ఉందని మునిసిపల్ ఎన్నికల్లో తన మద్దతు కావాలని ఎవరు కోరితే వారికి అనుకూలంగా ప్రచారం చేస్తానన్నారు. జగిత్యాల, రాయికల్ పట్టణాల్లో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరు కోరినా వారికి అనుకూలంగా ఉంటనన్నారు. అయితే తనతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న అభ్యర్థులు పోటీ చేస్తున్న వార్డుల్లో తప్ప ఇతర వార్డుల్లోని వారికి మాత్రమే తన మద్దతు ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. తన ఆరాటమంతా ఎన్నికల కోసం కాదని అభివృద్ది కోసమేనని అందు కోసమే ప్రభుత్వంతో కలిసి పని చేస్తాను తప్ప కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరలేదన్నారు.

BRS MLABRS NEWSDR SANJAY MLAJAGITIALTelangana Politics
Comments (0)
Add Comment