Telangana: కేసీఆర్ ను గద్దె దించేందుకు కుట్ర చేశావ్…

ఈటలపై కౌశిక్ రెడ్డి ధ్వజం…

దిశ దశ, హుజురాబాద్:

మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ లక్ష్యంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా కేసీఆర్ నే గద్దె దింపేందుకు కుట్ర చేశారని ధ్వజమొత్తారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టడం ఈటల రాజేందర్ నైజమని మండి పడ్డారు. రెండు సార్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, రెండు సార్లు మంత్రిగా పని చేశానని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ కు రాజకీయ భిక్ష పెట్టింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. దేవుని లాంటి కేసీఆర్ ను ఎలా మోసం చేశారాని..? ఆయనను ఎలా విమర్శిస్తున్నారని అడిగారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఆయని కాదకదా… కనీసం తనపై కామెంట్ చేసే స్థాయి కూడా ఈటలది కాదని, తన చేతిలోనే చిత్తు చిత్తుగా ఓడిపోయారన్నారు. అక్రమంగా సంపాదించారని గుర్తించి, పేద దళితుల భూములను స్వాధీనం చేసుకున్నారని గుర్తించి రాజేందర్ ను పార్టీలోంచి కేసీఆర్  వెళ్లగొట్టారన్నారు. కేసీఆర్ కు ద్రోహం చేసేందుకు ఎమ్మెల్యేలను పిలిచి డబ్బులు ఇస్తానని ఆయనను గద్దె దింపినట్టయితే తాను ముఖ్యమంత్రి అవుతానని ఈటల రాజేందర్ అంటే ఎవరూ ముందుకు రాలేదన్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీయనుంది.

కేసీఆర్ ఫోటోలే…

2001లో కమలాపూర్, హుజురాబాద్ ప్రాంతాల్లో గులాభి జెండా రెప రెపలాడడానికి కారణం కేసీఆర్ ఫోటోలేనని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ 2002లో పార్టీలో చేరలేదని 2004 ఎన్నికలకు ఆరు నెలల ముందు వచ్చి ఎమ్మెల్యే అయ్యాడన్నారు. 2001లో కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, తన తండ్రి సాయినాథ్ రెడ్డిలు పార్టీ నిర్మాణానికి కృషి చేశారని, అప్పుడు ఈ ప్రాంతంలోని స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారన్నారు. నా కార్యకర్తలను తిట్టడం సరికాదని వారంతా కూడా కేసీఆర్ వెంటే నడుస్తున్నారని వారిపై వ్యాఖ్యలు చేస్తే హుజురాబాద్ నియోజకవర్గంలో ఊరికిస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కేసీఆర్ ను ఎలా మోసగించారో, హుజురాబాద్ పార్టీ శ్రేణులు, ప్రజలను కూడా మోసం చేశారని కౌశిక్ రెడ్డి దుయ్య బట్టారు. 20 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన వారిని 2021లో ఈటల తనతో పాటు తీసుకెళ్లి మోసం చేశారని ఆరోపించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత హుజురాబాద్ ప్రాంతాన్ని వదిలిపెట్టి మల్కాజ్ గిరికి వెల్లిపోయారని, రాజకీయ బిక్ష పెట్టిన ఈ ప్రాంత ప్రజలను, పార్టీ నాయకులను కూడా మోసం చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటలతో పాటు బీజేపీలో చేరిన హుజురాబాద్ నాయకులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే వారిని ఆహ్వానిస్తానని ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ద్వారా పార్టీలో చేర్పించుకుంటానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు.

‘‘బండి’’ ట్రాప్ లో…

ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్రాప్ లో పడ్డారని, తాను మాత్రం పడలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ది విషయంలో అందరితో కలిసి నడుస్తానని, అందులో భాగంగానే తాను బండి సంజయ్ తో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నానని అన్నారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వచ్చినా వారితో కలిసి అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. అయితే ఈటల రాజేందర్ బండి సంజయ్ ట్రాప్ లో పడి తనను విమర్శిస్తున్నారన్నారు. 

ముదిరాజ్ బిడ్డలపై…

ముదిరాజ్ బిడ్డలను ఏనాడూ ఆదరించలేదని, వారిని ఈటల రాజేందర్ ఇంట్లో డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టి భోజనం పెట్టారా అని అడిగారు. వారిని చీడ పురుగుల్లా చూశారని, ఆయన కడుపున పుట్టిన బిడ్డలకు ముదిరాజ్ అని ఎందుకు పెట్టలేదో చెప్పాలన్నారు.

ముక్కు భూమికి రాస్తా…

2021 ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా గెలిచిన తరువాత హుజురాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు పిలువలేదని ఈటల చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఆనాడు అధికారులు స్థానిక ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం ఈటల రాజేందర్ ను ఆహ్వానించినా ఆహంకారంతో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనలేదని ఎదురు దాడి చేశారు. ఎమ్మెల్సీ, విప్ హోదాలో అప్పుడు నియోజకవర్గంలో చేపట్టిన అభిృద్ది పనుల కోసం వేసిన శిలా ఫలకాల్లో స్థానిక ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ పేరు ఉందో లేదో చూడాలని లేనట్టయితే తాను ముక్కు భూమికి రాయడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉన్నట్టయితే ఈటల రాజేందర్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ శ్రీనివాస్, నాయకులు గందె శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

BRS NEWSetela rajenderhuzurabadKCRMLA PADI KOUSHIKREDDY